తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. నేడు వాతావరణం ఎలా ఉందంటే!
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:49 PM
వేసవిలో సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో గరిష్ఠగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతాయి. కానీ మార్చి తొలి వారంలోనే ఆ తరహాలో భానుడు భగభగా మండుతున్నాడు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో వాతావరణం ఎలా ఉందంటే...
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వచ్చే రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నట్ల వాతావరణశాఖ హెచ్చరించింది. పగటి వేళ 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. నగరాలు, పట్టణాల్లో వేడి గాలులు కూడా ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే తగినంత నీరు తాగడం, తలపై టోపీ లేదా వస్త్రం ఉపయోగించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఏపీలోని పలు ప్రాంతాల్లో పగటి పూట అధిక ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి సమయంలో ఉక్కపోత ఎక్కువగా ఉంటంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. అయితే వచ్చే వారం నుంచి వాతావరణంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. మార్చి నెల చివరి వారం నాటికి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. ఏప్రిల్ నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ప్రజలు ఎండ తీవ్రత నుంచి రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
మరోవైపు తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో ఉదయం కొద్దిగా చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలుగా నమోదైంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి గాలులు వీస్తున్నాయి. మొత్తం మీద ఇవాళ కొన్ని ప్రాంతాల మినహా ఎక్కువ ప్రాంతాల్లో వాతావరణం సాధారణంగానే ఉండనుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. మంగళవారం, బుధవారం తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు ఇదే స్థాయిలో ఉంటాయని వాతావరణ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అలానే రానున్న రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్2026: గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
ఆ సారా తాగితే ఆరోగ్యం.. ప్రభుత్వానికి రూ. లక్ష కోట్ల ఆదాయం.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు