Share News

ఐపీఎల్2026: గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:07 PM

ఐపీఎల్‌-2026 సీజన్‌కు ముందు గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడెన్‌ను తమ జట్టు కొత్త బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు టైటాన్స్ ప్రకటించింది.

ఐపీఎల్2026: గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
Matthew Hayden

స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ లీగ్‍కు సంబంధించిన ప్రతి అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడెన్‌ను(Matthew Hayden) తమ జట్టు కొత్త బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు గుజరాత్ ప్రకటించింది. ప్రపంచ కప్ విజేత, విధ్వంసకర ప్లేయర్‌ హేడెన్ రాకతో టైటాన్స్ బ్యాటింగ్ విభాగం మరింత స్ట్రాంగ్ కానుంది.


మాథ్యూ హేడెన్‌ గురించి గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి ఓ కీలక ప్రకటన చేశారు. 'మా ప్రయాణంలో మాథ్యూ హేడెన్ నియామకం ఒక కీలక పరిణామం. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాథ్యూను మా బ్యాటింగ్ శిక్షకుడిగా నియమించాము. యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడంలో అతడి అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది' అని విక్రమ్ సోలంకి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


ఈ డేంజరస్ బ్యాటర్ గుజరాత్ హెడ్ కోచ్‌ ఆశిష్ నెహ్రా(Ashish Nehra), పార్థివ్ పటేల్‌లతో కలిసి పనిచేయనున్నాడు. గతంలో హేడెన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 32 మ్యాచ్‌లు ఆడాడు. 2010లో సీఎస్కేకి టైటిల్ అందించగా, 2009లో 12 మ్యాచ్‌ల్లో 572 పరుగులు చేసి ఆరెంజ్ కాప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. పవర్ ప్లే ఓవర్లలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆట తీరునే మార్చేవాడు హేడెన్.


ఇప్పుడు కోచ్‌గా గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ఎలాంటి శిక్షణ ఇస్తారో చూడాలి. హేడన్ గతంలో 2021టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. కానీ పూర్తి స్ధాయిలో ఎప్పుడు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించలేదు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న హేడెన్‌.. ఐపీఎల్‌లో కూడా తన మార్క్‌ను చూపించాడు. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

పశ్చిమాసియాలో యుద్ధం.. శ్రీలంక-అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లు రద్దు

టీమ్ ఇండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

Updated Date - Mar 10 , 2026 | 03:20 PM