టీమ్ ఇండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
ABN , Publish Date - Mar 10 , 2026 | 01:52 PM
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) టీమ్ ఇండియాకు మంగళవారం 131 కోట్ల రూపాయల భారీ నజరానా ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా ధ్రువీకరించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: టీమిండియా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 96 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) టీమ్ ఇండియాకు మంగళవారం 131 కోట్ల రూపాయల భారీ నజరానా ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా ధ్రువీకరించారు.
ఆయన స్పందిస్తూ.. ‘ఈ విజయంతో.. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్‌లో మూడు సార్లు విజయం సాధించిన మొదటి జట్టుగా ఇండియా నిలిచింది. ఈ ఫార్మాట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది’ అని అన్నారు. అద్భుతమైన ప్రదర్శనతో టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు బీసీసీఐ 131 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించిందని చెప్పారు.
ఆరు కోట్లు పెంచిన బీసీసీఐ
2024లో టీమ్ ఇండియా టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు కూడా బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. అప్పుడు 125 కోట్ల రూపాయల బహుమతి ఇచ్చింది. ఈ సారి ఆరు కోట్ల రూపాయలు పెంచి 131 కోట్ల రూపాయల బహుమతి ప్రకటించింది. ఐసీసీ కూడా టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు 21.5 కోట్ల రూపాయలు.. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు 10.75 కోట్ల రూపాయలు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
మీ బ్రెయిన్‌కు సవాల్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 19 సెకెన్లలో కనిపెట్టండి
రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలు.. బండి సంజయ్ హెచ్చరిక