అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
ABN , Publish Date - Mar 20 , 2026 | 07:29 PM
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నందున ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అమరావతి: రాష్ట్రంలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర తీరప్రాంతం, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికి తోడు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల మీదుగా ద్రోణి విస్తరించిందని రాష్ట్ర వాతావరణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో శనివారం.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
అదేవిధంగా పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. ఆదివారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో పొలాల్లో ఉండకూడదని హెచ్చరించారు. అలాగే ప్రజలు చెట్ల కింద నిలబడకూడదని, అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
Also Read:
పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని లెక్కించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
యువత ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం: పవన్ కల్యాణ్
నా ఛాంప్‌తో కలిసి ఉగాది వేడుకలు.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర పోస్టు
Read Latest AP News