బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Aug 30 , 2026 | 05:51 AM
పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది.
రాష్ట్రంపై పెద్దగా ప్రభావం ఉండదన్న వాతావరణశాఖ
తిరుపతిలో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత
విశాఖపట్నం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న రెండు రోజుల్లో బలపడుతూ పశ్చిమబెంగాల్, ఒడిశా మీదుగా ఝార్ఖండ్ వైపు పయనించనుంది. దీని ప్రభావంతో శనివారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత కొనసాగింది. తిరుపతి, కావలిల్లో 38.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అల్పపీడనం తీరం దాటిన తర్వాత దక్షిణ దిశగా పయనిస్తే తప్ప ఉత్తర కోస్తా వరకు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అంచనా వేసింది. తాజా అంచనా మేరకు అల్పపీడనంతో కోస్తాలో చెదురుమదురు వర్షాలు మాత్రమే కురుస్తాయని పేర్కొంది. రానున్న వారం రోజులు రాష్ట్రంలో పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపింది. ఉత్తరాంధ్రలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున ఆదివారం మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఈ నెలలో ఇప్పటివరకూ ఐదు అల్పపీడనాలు ఏర్పడగా.. ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు అవరోధం ఏర్పడింది.
Also Read:
సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్
గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు