Share News

రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

ABN , Publish Date - Apr 04 , 2026 | 09:24 PM

దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం నుంచి మూడ్రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
Weather Alert

అమరావతి: దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం నుంచి మూడ్రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. పిడుగుల నేపథ్యంలో ఎవరూ చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.


తీవ్ర వడగాలులు..

మరోవైపు ఆదివారం నాడు ఏపీ వ్యాప్తంగా 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. ఆదివారం (05-04-26) శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, బూర్జ, హిర, జలుమూరు, లక్ష్మీనర్సుపేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాల్లో తీవ్ర వడగాలులు ఉండనున్నాయని వెల్లడించారు. విజయనగరం జిల్లా గుర్ల, సంతకవిటి మండలాలు, అలాగే పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉండనుందని చెప్పారు. పోలవరం జిల్లా గంగవరం, కూనవరం మండలాలు, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.


సాధారణ వడగాలులు..

శ్రీకాకుళం జిల్లాలో 2 మండలాలు, విజయనగరం 8, అల్లూరి మన్యం 9, పోలవరం 3, కాకినాడ 2, తూర్పుగోదావరి 2, ఏలూరు 3, ఎన్టీఆర్ 3 మండలాల చొప్పున మెుత్తం 32 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


నేటి ఉష్ణోగ్రతలు..

శనివారం నాడు నెల్లూరు జిల్లా గూడూరులో 41.2°C, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.1°C, కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 40.9°C, చిత్తూరు జిల్లా నగరిలో 40.4°C, మన్యం జిల్లా వీరఘట్టంలో 40.3°C ఉష్ణో్గ్రతలు నమోదు అయ్యాయి. అలాగే విజయనగరం జిల్లా గుర్లలో 40.1°C, పల్నాడు జిల్లా గురజాలలో 39.8°C, నంద్యాల జిల్లా గుల్లదుర్తి, కర్నూలు జిల్లా తోవిలో 39.7°C చొప్పున గరిష్ఠంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆయన వెల్లడించారు.


జాగ్రత్తలు..

ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. వడగాలుల వీస్తున్నందున మహిళలు, పిల్లలు, వృద్ధులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్ఎస్, ఇంట్లో చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ రసం, మజ్జిగ, కొబ్బరినీళ్లు సహా మంచినీళ్లు వంటి ద్రావణాలను ఎక్కువగా తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

తీవ్ర విషాదం.. గోదావరిలో ముగ్గురు గల్లంతు..

మావిగన్ ట్రోలింగ్ చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి: మంత్రి కందుల దుర్గేష్

Updated Date - Apr 04 , 2026 | 09:25 PM