నేలకోట కొండపై పెద్దపులి కలకలం.. భయాందోళనలో స్థానికులు
ABN , Publish Date - Apr 04 , 2026 | 07:57 PM
పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని నేలకోట కొండ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే..
దేవీపట్నం, ఏప్రిల్ 4: పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని నేలకోట కొండ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచరిస్తుండటంతో అటవీ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. మరోవైపు అటవీ అధికారులు పులిని పట్టుకునేందుకు అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నేలకోట కొండపై సంచరిస్తున్న పులి అకస్మాత్తుగా స్థానికుల కంటపడింది. సాధారణంగా మనుషులు కనిపిస్తే దాడి చేసే పులి, ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఎదురుగా మనుషులు ఉన్నప్పటికీ, వారిపై దాడి చేయకుండా నెమ్మదిగా వెనక్కి వెళ్లిపోయింది.
ఈ విషయం స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. పులి అడుగుజాడలను బట్టి దాని కదలికలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులకు పలు కీలక సూచనలు చేశారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండేవారు, పొలాల పనులకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని సూచించారు. చీకటి పడ్డాక ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, పశువుల కాపరులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పులి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతికి చట్టబద్ధత.. ఎన్నారై నేత శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో సంబరాలు
మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు సంతృప్తిగా ఉన్నారు: మంత్రి కొల్లు రవీంద్ర