Share News

‘అర్నబ్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన

ABN , Publish Date - Oct 26 , 2026 | 03:31 PM

బంగాళాఖాతంలో అర్నబ్ తుఫాన్ బలపడుతోంది. ఇవాళ అర్ధరాత్రికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా, రేపు అతి తీవ్ర తుఫాన్‌గా మారనుంది.

‘అర్నబ్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన
Arnab Cyclone

విజయవాడ, అక్టోబర్ 26: బంగాళాఖాతంలో అర్నబ్ తుఫాన్ బలపడుతోంది. ఇవాళ (సోమవారం) అర్ధరాత్రికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా, రేపు (మంగళవారం) అతి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఎల్లుండి (అక్టోబర్ 28న) ఉదయం బాపట్ల - విశాఖ మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశ ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం దాటే సమయంలో 115-125 కిలోమీటర్లు, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు చెప్పారు.


రేపు కోస్తా తీరం వెంబడి 90-100 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ఈ క్రమంలో చెట్లు, భారీ హోర్డింగ్స్, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదని ప్రఖర్ జైన్ తెలిపారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అత్యవసర సహాయక చర్యల కోసం ప్రభావిత జిల్లాల్లో 7 NDRF, 8 SDRF బృందాలు చేరుకున్నట్లు వెల్లడించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 112 | 1070 | 18004250101ను సంప్రదించాలన్నారు. తుఫాన్‌ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని.. బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాల్లో జాగ్రత్తగా కట్టి ఉంచుకోవాలని సూచించారు. ఎగసిపడే అలల వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగే ప్రయత్నాలు చేయవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.

arnab-weather.jpg


రేపు వర్షాలు పడే జిల్లాలు ఇవే..

అత్యంత భారీ వర్షాలు: కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలు

భారీ నుంచి అతిభారీ వర్షాలు: శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలు

భారీ వర్షాలు: పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాలు


అర్నబ్ తుఫాన్‌పై కేంద్రం సమీక్ష..

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారనున్న అర్నబ్ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్‌ సన్నద్ధతపై జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎంసీ)తో కేంద్ర కేబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్ సమీక్ష నిర్వహించారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారనున్న ‘అర్నబ్’.. ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు కదులుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 650 కిలోమీటర్లు, కాకినాడకు 730 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 830 కిలోమీటర్లు, బాపట్లకు 910 కిలోమీటర్ల దూరంలో తుఫాన్‌ కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. అక్టోబర్ 28వ తేదీ ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్లు, గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


తుఫాన్‌ సన్నద్ధతలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ ప్రాంతాల్లోనూ తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తీర ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు, కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. అవసరమైతే సహాయక చర్యలు చేపట్టేందుకు సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, కోస్ట్‌గార్డ్‌ బలగాలు నౌకలు, విమానాలతో సిద్ధంగా ఉన్నాయి. తుఫాన్‌ నేపథ్యంలో అక్టోబర్‌ 26 నుంచి 29వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే తీర ప్రాంతాలకు బోట్లు చేరుకుంటున్నాయి. విద్యుత్‌, సమాచార వ్యవస్థలకు అంతరాయం ఏర్పడితే యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరించాలని అధికారులను కేంద్రం ఆదేశించింది.


ఇవి కూడా చదవండి...

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. పోస్టల్ బ్యాలెట్‌పై ఎస్‌ఈసీ కొత్త మార్గదర్శకాలు

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి 40 ఏళ్లు.. వైద్య విద్యలో ఏఐ, పరిశోధనలకు గవర్నర్ పిలుపు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 04:07 PM