ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే ఛాన్స్
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:54 PM
ఆగ్నేయ, ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో 6 కిమీ వేగంతో తీవ్రవాయుగుండం కదులుతోందన్నారు.
అమరావతి, నవంబర్ 16: ఆగ్నేయ, ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో 6 కిలో మీటర్ల వేగంతో తీవ్రవాయుగుండం కదులుతోందన్నారు. ప్రస్తుతం చెన్నైకు 700 కి.మీ., విశాఖపట్నానికి 800 కి.మీ., గోపాల్‌పూర్‌కు 910 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించారు.
దక్షిణమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు (మంగళవారం) పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా మారే అవకాశం ఉందన్నారు. పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ శుక్రవారం మధ్యాహ్నానికి అతి తీవ్ర తుపానుగా నెల్లూరు- తుని మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తుపాను నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో గురు, శుక్రవారాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే సూచన ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 40-60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఈ క్రమంలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏఐ దుర్వినియోగానికి చెక్ పెట్టండి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి చిరంజీవి వినతి
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే!
Read Latest AP News And Telugu News