ఏపీ ప్రజలకు అలర్ట్.. రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు..
ABN , Publish Date - Sep 13 , 2026 | 10:00 AM
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు వెల్లడించారు. విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా అది కదిలే అవకాశముందని ఆయన చెప్పారు.
దీని కారణంగానే ఏపీలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. మరోవైపు, ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వర్షాలు, పిడుగులు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని హెచ్చరించారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
భారీ వర్షాల కారణంగా వాగులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ స్థానిక అధికారులు, విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలను పాటించాలని ప్రజలకు ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి