Share News

వంటలు: పువ్వు కాని పువ్వు

ABN , Publish Date - Nov 29 , 2026 | 12:04 PM

వాములోంచి తీసిన సారం పువ్వులాగా తెల్లగా ఉంటుంది. అందుకని దాన్ని వాంపువ్వు (థైమాల్‌) అంటారు. వాముకి ఆ ఘాటైన వాసన, రుచి రావడానికి ఇదే కారణం.

వంటలు: పువ్వు కాని పువ్వు
vantalu

వాములోంచి తీసిన సారం పువ్వులాగా తెల్లగా ఉంటుంది. అందుకని దాన్ని వాంపువ్వు (థైమాల్‌) అంటారు. వాముకి ఆ ఘాటైన వాసన, రుచి రావడానికి ఇదే కారణం. పచారీ కొట్లలో, మూలికలు అమ్మే షాపుల్లో, ఆన్‌లైన్లో కూడా దొరుకుతుంది. వాము గుణాలే అనేక రెట్లు ఎక్కువగా కలిగిన ద్రవ్యం ఇది. వాముని వంటల్లో చిటికెడంత వేస్తారు. పువ్వునైతే నలకంత వేస్తే సరిపోతుంది. నేరుగా నాలుక మీద వేసుకుంటే బొబ్బలెక్కుతాయి. జాగ్రత్తగా వాడుకోవాలి.

వాంపువ్వుని వాడుకోవటం ఎందుకంటే అది చెడ్డ బ్యాక్టీరియాని, ఈస్ట్‌, ఫంగస్‌ లాంటి వాటిని నిరోధిస్తుంది. ఇ-కోలై, స్టెఫలో కాకస్‌, సాల్మొనెల్లా, కాన్‌డిడా లాంటి సూక్ష్మజీవులను దెబ్బతీసే శక్తి దీనికి ఉంది.


కొన్ని సూక్ష్మజీవులు కాలనీలాగా ఏర్పడి తమకు తామే ఒక రక్షణకవచాన్ని (బయోఫిల్మ్‌) ఏర్పరచుకుంటాయి. థైమాల్‌ ఈ పొరని ఛేదించ గలుగుతుందంటున్నారు.

ఆహారపదార్థాల ఆక్సీకరణం వలన జీవకణాలకు నష్టం కలక్కుండా కాపాడటాన్ని యాంటీ ఆక్సిడెంట్‌ గుణం అంటారు. వాంపువ్వుకి ఈ శక్తి ఉంది. కొన్ని రసాయన సంకేతాల వల్ల శరీర అవయవాలలో వాపులు ఏర్పడుతుంటాయి. వాంపువ్వు ఈ ప్రక్రియని నిరోధించగలుగుతుందని తేలింది.


పావుగ్లాసు గోరువెచ్చని పాలలో లేదానీళ్ళలో ఒకటి రెండు పలుకులు వాంపువ్వు వేసుకొని తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. పేగుల మృదుకండరాల కదలికలను ఇది సరిచేస్తుంది. కడుపులో నులినొప్పి, గ్యాసు తగ్గిపోతాయి. అజీర్తి విరేచనాలు, నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి. పళ్ళకు, చిగుళ్లకు దీనిని పట్టిస్తే చిగుళ్ళు గట్టిపడతాయి. పంటిపోటు తగ్గుతుంది

కొన్ని మౌత్‌వాష్‌లు, దంత సంరక్షణ ఉత్పత్తుల్లో, ఊపిరితిత్తుల పైన పనిచేసే ఔషధాల్లో సూక్ష్మజీవుల్ని నిరోధించటం కోసం కలుపుతుంటారు. దీన్ని కలిపితే ఆ ఔషధాన్ని బాగా వేగంగా పనిచేయిస్తుంది కూడా!


book6.2.jpgక్యాన్సర్‌ పరిశోధనల్లో థైమాల్‌ ప్రయోగం గురించి విస్తృతంగా ఆలోచనలు సాగు తున్నాయి. కణాల పెరుగుదల, విభజనలను నియంత్రించే శరీర యంత్రాంగాన్ని ఈ థైమాల్‌ ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు.

మాంసం, కూరగాయలు, పండ్లు వంటి ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా, బూజు పెరక్కుండా అడ్డుకోవడానికి, కొవ్వు పదార్థాలు త్వరగా పాడవకుండా ఉండడానికి దీనిని ఉపయోగించే అవకాశాల గురించి ఇప్పుడు ఆలోచనలు మొదలయ్యాయి. మాంసాన్ని కుళ్ళిపోకుండా నిలవుంచేందుకు విష రసాయనాలకు బదులు థైమాల్‌ ఉపయోగపడితే అంతకంటే కావలసిందేం ఉంటుంది?


ప్రకృతిలోని ఒక చిన్న సుగంధ పదార్థం ఇన్ని రకాల జీవక్రియాత్మక లక్షణాలను కలిగివుండటం విశేషం. సూక్ష్మజీవ నిరోధకత, యాంటీ ఆక్సిడెంట్‌ గుణం, వాపుని తగ్గించటం, ఆహార పరిరక్షణ వంటి రంగాల్లో పరిశోధనల్ని ఇది ఆకర్షిస్తోంది.

వాముని నేరుగా వాడుకుంటే ఈ ప్రయోజనాలన్నీ దక్కుతాయా అనేది అడగదగిన ప్రశ్నే!


వాములో 20-40ు థైమాల్‌ ఉంటుంది. దాని పరిమళాన్ని ఇష్టపడగలిగితే.. కూరల్లోనూ పచ్చళ్ళలోనూ పులుసుల్లో కూడా వాముని కొద్దిగా కలుపుకుంటే పరిమళమూ ఆరోగ్య ప్రయోజనాలూ తప్పక కలుగుతాయి.

వాము కలిపాక వండితే కొంతమేర థైమాల్‌ ఆవిరయ్యే అవకాశం ఉంది. గ్లాసు మజ్జిగలో పావుచెంచా వాముపొడి కలిపి తాగితే వాంపువ్వుని నూరుశాతం పొందవచ్చు. అన్నింటికన్నా ఇది తేలికైన ఉపాయం.

  • డా. జి.వి పూర్ణచందు, 94401 72642

Updated Date - Nov 29 , 2026 | 12:04 PM