Share News

మేలైన ఆహార ద్రవ్యాలు

ABN , Publish Date - Apr 26 , 2026 | 12:20 PM

మేలు చేయటం మాత్రమే తెలిసిన ఆహార పదార్థాల్ని హితస్వభావం కలిగినవిగా చెప్తూ భోజనకుతూహలం కొన్ని ఉదాహరణలిచ్చింది.

మేలైన ఆహార ద్రవ్యాలు
Healthy Superfoods

మేలు చేయటం మాత్రమే తెలిసిన ఆహార పదార్థాల్ని హితస్వభావం కలిగినవిగా చెప్తూ భోజనకుతూహలం కొన్ని ఉదాహరణలిచ్చింది.

ఎర్రబియ్యం: శాలిధాన్యం అంటే చాలా ఉన్నతమైన బియ్యం అని! ధైర్యశాలి, బలశాలి పదాలలో శాలి - ధాన్యాలలో శాలి ఒకే అర్థాన్నిస్తున్నాయి! ఈ శాలి ధాన్యాలలో అత్యంత బలశాలి ఎర్రబియ్యం లేదా నవారా బియ్యం. ఆంథోసైనిన్‌ అనే సహజ వర్ణద్రవ్యం దీనికి విషదోషహర గుణాలను ఇస్తోంది. పొట్టు తియ్యకుండానే వాడుకోవాలి. గ్లైసీమిక్‌ ఇండెక్సు తక్కువగా ఉంటుంది కాబట్టి, ఎర్రబియ్యం షుగరు రోగులకూ, స్థూలకాయులకూ మేలుచేసేదిగా ఉంటుంది.

యవ/బార్లీ: శూకధాన్యాలలో బార్లీ అత్యంత శ్రేష్ఠమైన ధాన్యం. తక్షణశక్తినిస్తుంది. పీచు అధికంగా ఉన్నవి కాబట్టి రక్తంలోకి షుగరు చేరటాన్ని ఆలస్యం చేస్తాయి. ఓట్సు కన్నా నాణ్యమైన ధాన్యం.


గోధుమ: ఆరోగ్యదాయక ధాన్యాలలో మూడవ స్థానం గోధుమలది! ఆహార నాణ్యతలో ఎర్రబియ్యం తరువాతే గోధుమలు!

పెసరపప్పు: పప్పుధాన్యాలలో అత్యున్నతమైనది పెసరపప్పు. అవకాశం ఉన్నంతమేర మిన ప్పప్పు, కందిపప్పు, శనగపప్పు లకుబదులుగా పెసర పప్పునే వండుకోవటానికి ఎక్కువ ప్రయ త్నించాలి! రోజూవారీగా ఇడ్లీ, అట్టు, పునుగులు, గారెలు ఇలా టిఫిన్ల పేరుతో అత్యధికంగా మినప్పప్పుని వాడేస్తున్నాం. షుగరు, స్థూలకాయాలకు కారణమవుతున్న ఈ వాడకం తగ్గాలి. ప్రత్యామ్నాయంగా పెసరపప్పుకి మళ్ళేందుకు ప్రయత్నించండి!

మసూరపప్పు: పెసరపప్పు తరువాతి స్థానం ఎర్రకందిపప్పు లేదా మసూరపప్పుదే! మన దేశంలో ఉత్పత్తి తగ్గి విదేశీ కంది పప్పు గతి అవుతోంది. కందిపప్పు వాడకం తగ్గించి మసూ రపప్పు వాడుతుంటే విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది కూడా!


కందిపప్పు: దేశవాళీ కందిపప్పుది పప్పుధాన్యాలలో మూడోస్థానం. దీనికి వేడిచేసే స్వభావం ఉన్నది. పరిమితంగా వాడాలి.

దానిమ్మ: పండ్లలో అత్యంత శ్రేష్ఠమైనది దానిమ్మ! పుల్లగా, తియ్యగా ఉంటుంది గానీ పులుపు, తీపి వలన కలిగే చెడుని తగ్గించటం దానిమ్మ ప్రత్యేకత.

ఉసిరిక: దానిమ్మ తరువాత సర్వశ్రేష్ఠమైనది ఉసిరిక. జీవనీయ విలువలు మెండుగా ఉన్నప్పటికీ వినియోగం దానిమ్మకే ఎక్కువ. ఉసిరికాయని ఔషధంగానే చూస్తున్నారు గానీ ఆహారద్రవ్యంగా భావించట్లేదు మనవాళ్లు.


ద్రాక్ష/ఖర్జూరం: పండ్లలో 3, 4 స్థానాలు ద్రాక్ష, ఖర్జూరాలవి.

మాదీఫలం: పుల్లని పళ్ళలో మాదీఫలం శ్రేష్ఠం. దీని తరువాతి స్థానాలు నిమ్మ, దబ్బ పండ్లను పేర్కొనవచ్చు.

గురుగు: బతూవా అని ఉత్తరాదిలో పిలిచే గురుగు ఆకుకూర సర్వశ్రేష్ఠమైనది. పప్పుకూర ఆకు, కూరాకు అని కూడా దీన్ని పిలుస్తారు. గురుగు మొక్కలు పొలం గట్లమీద రోడ్డు పక్కన పెరిగేవే. ‘పాత అంటే రోత’ అని తెలుగువాళ్లు తినరు కాబట్టి రైతులు పండించట్లేదు. నష్టం మనకే!

పాలకూర: భోజన కుతూహల కర్త రఘునాథ సూరి గురుగాకు తరువాత స్థానంలో పాలకూరను పేర్కొన్నాడు.


బచ్చలికూర: ఆ తరువాతి స్థానం బచ్చలి కూరది. పాలకూరతో వండేవన్నీ బచ్చలి కూరతోనూ వండుకోవచ్చు. కందతో కలిపి వండిన ఇగురుకూర తెలుగువారి స్పెషల్‌.

పరవాల్‌ బుడందొండకాయ: కూరగాయల్లో అత్యున్నతమైన స్థానాన్ని పరవాల్‌ కాయలకు ఇచ్చాడు. వీటిని మనం పూర్తిగా మరిచాం. ఉత్తరాదిలో వీటి వ్యాప్తి ఎక్కువ. మందపాటి చెక్కుతీసి వండితే రుచి దొండలాగానే ఉంటుంది.

కంద: దుంపకూరల్లో కంద దుంపని నాణ్యమైనదిగా భోజన కుతూహలం పేర్కొంది.

నీళ్ళలో వాననీటిని, పాలలో ఆవుపాలను, కొవ్వు పదార్థాలలో వెన్నని, నూనెలలో నువ్వుల నూనెని, చక్కెరల్లో బ్రౌన్‌ షుగర్ని శ్రేష్ఠమైనదిగా ఈ గ్రంథం ప్రకటించింది. శ్రేష్ఠమైన వాటిలో మనం ఎన్నింటిని ఎంత వినియోగిస్తున్నామో ఎవరికివారు ఆలోచించి తమ మార్కులు తామే వేసుకోవాలి!

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


ఈ వార్తలు కూడా చదవండి:

సమ్మర్‌ టూర్‌కు సిద్ధమవుతున్నారా?

అది త్యాగం కాదు.. ఎంపిక

Read Latest Telangana News and National News

Updated Date - Apr 26 , 2026 | 12:20 PM