పొట్టను కాపాడే ఆహారాలు
ABN , Publish Date - Mar 01 , 2026 | 01:27 PM
16వ శతాబ్దపు పండితుడు రఘునాథ సూరి రచించిన ‘భోజనకుతూహలం’ గ్రంథానికి ఆచార్య బాలకృష్ణ ఆంగ్లానువాదం ప్రచురిస్తూ, వైద్యరాజ కాశీనాథ పండితుడు రచించిన అజీర్ణామృతమంజరి గ్రంథంలోంచి అజీర్ణశమనం అనే అధ్యాయాన్ని అందించారు.
16వ శతాబ్దపు పండితుడు రఘునాథ సూరి రచించిన ‘భోజనకుతూహలం’ గ్రంథానికి ఆచార్య బాలకృష్ణ ఆంగ్లానువాదం ప్రచురిస్తూ, వైద్యరాజ కాశీనాథ పండితుడు రచించిన అజీర్ణామృతమంజరి గ్రంథంలోంచి అజీర్ణశమనం అనే అధ్యాయాన్ని అందించారు.
అజీర్తి, మలబద్ధతలకు ఆహారమే అసలు కారణం. మన జీవనవిధానం దాన్ని మరింత పెంచి పోషిస్తుంది. ఏ ఆహార పదార్థాన్ని అతిగా తీసుకుంటే పొట్టచెడుతుందో, ఏ ఆహార పదార్థం తీసుకుంటే దాన్ని నివారిస్తుందో ఆసక్తిదాయక విశేషాలను ఈ అధ్యాయంలో వివరించాడు. ఒక విధంగా ఇవి వైద్యరహస్యాలు.
వాటిలో ఎంపికచేసిన కొన్ని మీకోసం...
కొబ్బరినీ, పాలనీ అతిగా తీసుకున్నప్పుడు: ఎసట్లో అన్నం ఉడికేప్పుడు తీసిన నీళ్లని చిట్టు డుకు నీళ్లు అంటారు. ఇవి తాగితే పొట్టలో గడబిడ తగ్గుతుంది. విరేచనం అవుతుంది.
మామిడిని అతిగా తిన్నప్పుడు: వేడిగా పాలు తాగితే అజీర్తి, మలబద్ధకం లేకుండా ఉంటాయి. విరుగుడుగా పనిచేస్తాయి.
నెయ్యి లేదా నూనె పదార్థాలు అతిగా తీసుకున్నప్పుడు: నేరేడు పళ్ళ రసం లేదా నిమ్మరసం తాగాలి.
నేతి అతి వాడకానికి: బార్లీ జావ, మజ్జిగ విరుగుడుగా పనిచేస్తుంది.
నిమ్మరసానికి ఉప్పు విరుగుడుగా పనిచేస్తుంది.
ఉప్పు అతిగా తీసుకున్నప్పుడు: గంజి లేదా అంబలి ఉపశమనం.
అరటికాయ లేదా అరటిపండుని అతిగా తిన్నప్పుడు: కొద్దిగా పేరునెయ్యి పంచదార కలిపి తింటే పొట్ట మృదువౌతుంది.
గోధుమలు సరిపడనప్పుడు: దోసకాయతో చేసిన ఏదైనా వంటకం తింటే ఉపశమనం కలుగుతుంది.
మాంసం అతిగా తిన్నప్పుడు: అన్నం వార్చిన గంజి లేదా బియ్యపు జావ తాగితే ఉపశమనం.
నారింజ, పంపరపనస, నిమ్మ లాంటి పుల్లని పండ్లు అతిగా తీసుకుంటే, అరికెల జావ లేదా అంబలి తాగితే పొట్ట తేలికపడుతుంది.
విరేచనం అవుతుంది.
మినప, పెసర, శనగ, మైదాలాంటి పిండిపదార్థాలను అతిగా తిన్నప్పుడు: వేడి నీళ్లు తాగితే ఉపశమనం.
సారచెట్టు కాయలు అతిగా తిన్నప్పుడు ఉసిరికాయ తీసుకోవాలి.
మినప్పప్పుతో వండినవి అతిగా తింటే గుప్పెడు పంచదార తినాలి.
పాలు, పాల పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు కలిగే ఇబ్బందులకు మజ్జిగ ఉపశమనం ఇస్తుంది.
రేగుపండ్లు, మామిడి పండ్లు అమితంగా తిన్నప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగితే పొట్ట చెడకుండా ఉంటుంది.
చేపలు అతిగా తిన్నప్పుడు మామిడి పండ్లరసం తాగితే ఉపశమనం.
అతిగా మద్యపానం చేస్తే.. తేనె కలిసిన నీళ్లు తాగిస్తే విరుగుడు.
ఇప్పపువ్వు లాంటి మాదకద్రవ్యాలకు వేప గింజల పొడిని నీళ్ళలో కలిపి తాగిస్తే విరుగుడు.
ఆలుబుఖారా అతిగా తిన్నప్పుడు ఆవనూనె కొద్దిగా తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
పనసపండుకి అరటి పండు విరుగుడు.
వెల్లుల్లి అతిగా తిన్నవాళ్లకు బాగా మరగకాచి చల్లార్చిన పాలు ఇస్తే విరుగుడుగా పనిచేస్తుంది.
వంకాయల్ని అల్లంతో వండుకుంటే ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది.
ముల్లంగి, తోటకూర, పాలకూరలాంటి ఆకుకూరలు, సొర, పొట్ల వండుకున్నప్పుడు ఆవపెట్టి తినటం మంచిది.
గంజి లేదా అంబలిలో తగినంత ఉప్పు కలిపి తాగితే పిండి పదార్థాలన్నింటికీ విరు గుడుగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే అంబలి తాగటం కేవలం కడుపు నింపుకోవటానికే కాదు, విషదోషాలను హరించటానికి కూడా అని గమనించాలి.
సామల్లాంటి చిరుధాన్యాలను తిన్నప్పుడు పలుచని మజ్జిగ లేదా మజ్జిగ మీద తేట ఎక్కువగా తీసుకోవాలి.
- డా. జి వి పూర్ణచందు, 94401 72642
పాలకూర పచ్చడి
కావలసిన పదార్థాలు: పాలకూర - కట్ట, ఉల్లిముక్కలు - అర కప్పు, టమాటా ముక్కలు - అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు - పది, ఆవాలు - స్పూను, జీలకర్ర - స్పూను, మినప్పప్పు - స్పూను, శనగపప్పు - స్పూను, ఎండు మిర్చి - మూడు, కరివేపాకు రెబ్బలు- కొన్ని, కారం - రెండు స్పూన్లు, పసుపు - అర స్పూను, ధనియాల పొడి- స్పూను, ఉప్పు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం: ఉల్లి, టమాటా, వెల్లుల్లిని మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఓ బాణలిలో కాస్త నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండు మిర్చి, కరివేపాకును చిటపటలాడించాలి. ఆ తరవాత మంటను తగ్గించి కారం, పసుపు, ధనియాల పొడి, స్పూను ఉప్పు కలపాలి. అంతా ఘుమఘుమలాడుతుంటే టమాటా పేస్టును జతచేయాలి. ఓ ఐదు నిమిషాల తరవాత మిశ్రమం అంతా దగ్గరై నూనె బయటకి వస్తుంటే కత్తిరించిన పాలకూరను ఇందులో కలపాలి. ఓ స్పూను ఉప్పునూ జతచేయాలి. పాలకూర మొత్తం ఉడికి, అంతా కలిసిపోయే వరకు ఉడికించి స్టవ్ కట్టేస్తే సరి.
బొప్పాయి హల్వా
కావలసిన పదార్థాలు: బొప్పాయి పండు - కిలో, కస్టర్డ్ పొడి - అర కప్పు, చక్కెర - ముప్పావు కప్పు, పాలు - రెండు కప్పులు, నెయ్యి
- పావు కప్పు.
తయారుచేసే విధానం: బొప్పాయి తోలు, గింజలు తీసి, ముక్కలుగా కోసి, మిక్సీలో ప్యూరీలా చేయాలి. ఓ పెద్ద గిన్నెలో ఈ ప్యూరీని వేసి కస్టర్డ్ పొడి, చక్కెర, పాలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ మందపాటి బాణలిలో వేసి ఉడికించాలి. అయితే నిరంతరం గరిటెతో కలుపుతూనే ఉండాలి. అయిదు నిమిషాల తరవాత నెయ్యిని జతచేయాలి. బాగా దగ్గరగా అయ్యాక స్టవ్ కట్టేసి నెయ్యి పూసిన ట్రే మీద బొప్పాయి మిశ్రమాన్ని వేయాలి. ఓ గంట తరవాత ముక్కలుగా కోస్తే సరి. ఇష్టమైతే ఈ ముక్కల్ని ఎండు కొబ్బరి పొడిలో అద్ది తీస్తే మరింత రుచిగా ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం, వెండిపై వార్ ఎఫెక్ట్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
తిరుపతిలో మరో చారిత్రక ఘట్టం.. 16 కోర్టు భవనాలకు భూమి పూజ
Read Latest Telangana News and National News