అనుమతి కిలోల్లో.. తయారీ క్వింటాళ్లలో
ABN , Publish Date - Mar 01 , 2026 | 07:12 AM
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రం సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ నిర్వాహకులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు.
అడుగడుగునా ఉల్లంఘనలే
నైపుణ్యం లేని కూలీలతో పనులు
పరిమితికి మించి వినియోగం
రోజుకు 15 కిలోల లోపు బాణసంచా తయారీకి మాత్రమే అనుమతి
ప్రమాద సమయంలో 800 కిలోల నిల్వ
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రం సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ నిర్వాహకులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. ఈ బాణసంచా కేంద్రానికి అనుమతులు ఎలా ఇచ్చారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగితే క్షతగాత్రులను కాపాడేందుకు వాహనాలు వెళ్లడానికి వీలుగా రహదారి మార్గం ఉండాలి. కానీ ఇరుకైన రోడ్డు ఉంది. ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న మట్టిరోడ్డులో ప్రయాణించి కిందకు దిగాలి. నాలుగేళ్ల కిందట ఈ కంపెనీ బాణసంచా కేంద్రంలో ప్రమాదం జరిగినా గుట్టుగా ఉంచారు. ఆ తర్వాత తయారీ కేంద్రం మార్చి ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దీనికి రోజుకు పది నుంచి పదిహేను కేజీలలోపు మాత్రమే బాణసంచా తయారీకి అనుమతి ఉంది. కానీ ఈ కేంద్రంలో శనివారం 800 కేజీల బాణసంచా ఉంది. గోకవరం మండలంలో అమ్మవారి జాతర ఉత్సవాలకు బాణసంచా ఆర్డర్ భారీగా రావడంతో యజమాని అడ్డగోలు వ్యవహారానికి తెరలేపారు. లక్షలకు లక్షలు సంపాదించాలని, ఆర్డర్లు పూర్తి చేయడానికి ఏకంగా 70 మంది కూలీలను పనికి దించారు. వాస్తవానికి బాణసంచా తయారీలో నిపుణులైన కార్మికులను వినియోగించాలి.
ప్రమాదం జరిగితే కుటుంబానికి అండగా ఉండేలా బీమా చేయించాలి. కానీ ఇవేవీ చేయలేదు. అతి తక్కువ కూలి డబ్బులు ఇచ్చి పనికి పురమాయించారు. నైపుణ్యం లేని కార్మికులు కావడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 800 కేజీల బాణసంచా నిల్వ ఉండగా, అందులోను భారీ విస్ఫోటానికి దారితీసే నారబాంబులు ఉన్నాయి. దీంతో భారీ ప్రమాదం సంభవించింది. మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్‌ఇంజన్లు వచ్చినా 20 అడుగులకు మించి ఎత్తు ఉన్న గోదావరి కాలువ వెంబడి రోడ్డు నుంచి ప్రమాద స్థలానికి దిగడానికి రోడ్డు లేదు. దీంతో వాహనాలను అక్కడే ఉంచి పైపుల ద్వారా మంటలను అదుపు చేశారు. ఫైరింజన్లు ఆపడంతో ఇరుకైన రోడ్డులో అంబులెన్స్‌ల రాకపోకలకు వీల్లేకుండా పోయింది. బాణసంచా కేంద్రానికి లైసెన్స్ ఉందని అధికారులు గుర్తించారు. కానీ ఈ కేంద్రంలో పనిచేస్తున్న కూలీలు పరిమితికి మించి ఉన్నట్లు తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఓ కారణం.