Share News

ఇంగువ కథ

ABN , Publish Date - Feb 22 , 2026 | 01:20 PM

పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘ఇంగువ’ కథ ప్రసిద్ధమే! చావుబతుకుల్లో ఉన్న ఓ చదువరిని పలకరిద్దామని వచ్చిన మిత్రుణ్ణి చూసి, ఆ చివరి క్షణాల్లో కూడా తెలియనిదాన్ని తెలుసు కోవాలనే జిజ్ఞాసతో ‘‘ఇంగువ ఎలా తయార వుతుందంటావ్‌...?’’ అని అడుగుతాడు.

ఇంగువ కథ

పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘ఇంగువ’ కథ ప్రసిద్ధమే! చావుబతుకుల్లో ఉన్న ఓ చదువరిని పలకరిద్దామని వచ్చిన మిత్రుణ్ణి చూసి, ఆ చివరి క్షణాల్లో కూడా తెలియనిదాన్ని తెలుసు కోవాలనే జిజ్ఞాసతో ‘‘ఇంగువ ఎలా తయార వుతుందంటావ్‌...?’’ అని అడుగుతాడు. నిజానికి చాలామందికి ఇంగువ ఉత్పత్తి తెలీదు. క్యారెట్‌ కుటుంబానికి చెందిన ఇంగువ మొక్క వేళ్లు క్యారెట్‌ మాదిరిగానే ఉంటాయి. వాటికి గాటుపెడితే వచ్చే జిగురుపదార్థం (ఓలియో-గమ్‌-రెసిన్‌)ని హింగు లేదా ఇంగువ అంటారు.

ఆహార రుచిని, వాసనను పెంచేందుకు వేల యేళ్లుగా ఇంగువని వాడుతున్నారు. ఇది ఉగ్ర గ్రంథి. చాలా ఘాటైన వాసన కలది. అందుకని మాంసంలోని నీచు వాసనని కప్పి ఉంచటానికి దీన్ని ఎక్కువగా వాడతారు. ఇంగువకి తూర్పు దేశాల్లోనే ప్రాచుర్యం ఎక్కువ. ‘ఇంగువ కట్టిన గుడ్డ’ని ఇంగువ వాసన ఎన్నాళ్ళకూ వదలక పోవటం దీని తీక్షణతకు సాక్ష్యం.

ఉల్లి, వెల్లుల్లి తమో గుణాన్నిపెంచుతాయని, ఇంగువ మేథాసంపత్తిని వృద్ధి చేస్తుందనీ


శాకాహారులు నమ్ముతారు. ఇది అపోహ కాదు. మెదడులో నరాల ఉత్తేజాన్నిచ్చే గుణంతో పాటు, అల్జీమర్స్‌ లాంటి మతిమరపు వ్యాధుల్లో మెదడు కణాల పుట్టుకకు సాయపడ్తుంది. మూర్ఛలు, డిమెన్షియా లాంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది. మనసుకు ఉత్సాహాన్నిస్తుంది.

బిగుసుకున్న కండరాలను ముఖ్యంగా శ్వాసనాళాల కండరాల్లో వచ్చే బిగింపు తగ్గిస్తుంది. నాణ్యమైన ఇంగువతో సమానంగా ముద్దకర్పూరాన్ని తేనెతో నూరి పెసర గింజంత మాత్రలు చేసి 1-2 వేసుకుంటే వెంటనే ఆయాసం తగ్గుతుంది. పేగులు, లివర్‌ లాంటి అవయవాలలోని సున్నిత కండరాల్ని కూడా రిలాక్స్‌ చేస్తుంది.


book10.2.jpgసూది మొనతో తీసినంత స్వల్ప మోతాదుకే ‘ప్యాంక్రియాస్‌’ లాంటి అవయవాల కణ జాలంలో ఎంజైమ్‌ స్థాయి పెంచి, జీర్ణోత్తేజక ప్రభావాన్ని బలపరుస్తుంది! ఆహారంలో విషదోషాల్ని కూడా హరిస్తుంది. పేగుల్లో చెడ్డ బ్యాక్టీరియా చేరి అమీబియాసిస్‌ లాంటి వ్యాధులు ప్రబలినప్పుడు ఇంగువ క్రిమి నాశకంగా కూడా పనిచేస్తుంది.

‘చిత్రకాది వటి’ అనే ఆయుర్వేద ఔషధంలో చిత్రమూలం, ఇంగువ ప్రధాన ద్రవ్యాలుగా ఉంటాయి. ఇది జీర్ణాశయ వ్యవస్థను అన్ని విధాలా బలపరిచే శక్తిమంతమైన ఆహార ఔషధం కూడా!


శరీరంలో క్యాన్సర్‌ ఏర్పడకుండా అడ్డు కుంటూ, మామూలు గడ్డలు క్యాన్సర్‌ గడ్డలుగా మారకుండా ఇంగువ సహకరిస్తుంది. క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్నవారికి మేలిమి ఇంగువ మేలు చేస్తుంది. ఇంగువను నూనెలో వేసి వేగించి కూర, పప్పు, పచ్చడి వగైరాలలో కలిపి, అన్నంలో వేసుకుని తింటే ఎక్కువ ఉప యోగకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడం, స్థూలకాయం, కాలేయంలో కొవ్వు చేరిక (ఫ్యాటీ లివర్‌) నివారణలో కూడా హింగు ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లితో పోలిస్తే ఈ గుణం ఇంగువకే ఎక్కువని పరిశోధకులు చెప్తున్నారు. లివరు, స్ల్పీన్‌, పాంక్రియాజ్‌, కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండెల్ని శుద్ధి చేస్తుంది.


‘రజఃప్రవర్తనీవటి’ అనే ఔషధంలో ఇంగువ ప్రధాన ద్రవ్యం. నెలసరి సక్రమంగా లేని స్త్రీలు రజఃప్రవర్తనీవటి 1- 2 మాత్రలు రెండు పూటలా కొన్నాళ్ళపాటు వాడితే ఉపయోగకరం.

రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వుషుగరు లాంటి వాటిని తొలగించే ఛేదనీయ గుణం దీనికుంది. దోషాల్ని బైటకు వెళ్ళగొడ్తుంది. తీక్షణ గుణం వలన శరీరం లోపలికి చొచ్చుకునిపోయే శక్తి కలిగి ఉంటుంది. పురుషుల్లో జీవకణాలను పెంచుతుంది. పురుషత్వానికి కారణమయ్యే టెస్టోస్టిరాన్‌ హార్మోన్ని పెంచుతుంది.

ఇంగువ ఎక్కువైతే వేడి చేస్తుంది. రక్తస్రావం పెరిగేలా చేస్తుంది. మోతాదు ఎక్కువైతే బీపీ నార్మల్‌ కన్నా తగ్గిపోతుంది. అందుకని తక్కువ మోతాదులోనే వాడుకోవాలి.

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


book10.3.jpgపైనాపిల్‌ గొజ్జు

కావలసిన పదార్థాలు: పైనాపిల్‌ ముక్కలు - కప్పు, చింతపండు పులుసు- పావు కప్పు, బెల్లం పొడి-5 స్పూన్లు, ఎండు మిర్చి - ఏడు, బెల్లం- కాస్త, నువ్వులు - రెండు స్పూన్లు, మినుములు- రెండు స్పూన్లు, పచ్చి కొబ్బరి- ముప్పావు కప్పు, పసుపు, ఉప్పు, నూనె, నీళ్లు - తగినంత, మెంతులు - అర స్పూను, పోపు గింజలు - తగినన్ని, కరివేపాకు రెబ్బలు - కొన్ని.

తయారుచేసే విధానం: ముందుగా పైనాపిల్‌ ముక్కల్ని నీళ్లలో పది నిమిషాలు మరిగించి పెట్టుకోవాలి. ఆవాలను వేయించుకోవాలి. ఓ స్పూను నూనెలో మినుములు, మెంతులు, ఎండు మిర్చి, కరివేపా కును వేయించాలి. పచ్చి కొబ్బరి, పసుపు, ఉప్పుతో పాటువేయించిన మసాలా దినుసుల్ని, కాస్త నీటిని మిక్సీలో వేసి పేస్టు చేసుకోవాలి. ఓ బాణలిలో చింతపండు రసం, బెల్లం, పసుపు, ఉప్పు, మసాలా పేస్టునీ కలిపి పావుగంట మరిగించాలి. అవసరమైతే నీళ్లని కల పాలి. ఆ తరవాత పైనాపిల్‌ ముక్కల్నీ జతచేసి పదినిమిషాలు ఉడికిస్తే సరి. ఈ కర్ణాటక స్టయిల్‌ స్వీట్‌కర్రీ వెరైటీగా బాగుంటుంది.


బోండా సూప్‌

కావలసిన పదార్థాలు: మినప్పప్పు - కప్పు, పెసర పప్పు - ముప్పావు కప్పు, ఎండు కొబ్బరి - రెండు స్పూన్లు, అల్లం ముక్క - చిన్నది, కరివేపాకు రెబ్బలు - కొన్ని, మిరియాల పొడి - పావు స్పూను, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు, పచ్చిమిర్చి - మూడు, టమాటా ముక్కలు - రెండు స్పూన్లు, ఉల్లి ముక్కలు - రెండు స్పూన్లు, నిమ్మరసం - స్పూను, ఇంగువ - కొద్దిగా, జీలకర్ర - స్పూను, ఉప్పు, నూనె, నీళ్లు - తగినంత.


తయారుచేసే విధానం: మినప్పప్పును నీళ్లలో ఓ గంట పాటు నానబెట్టి, మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో మిరియాల పొడి, ఉప్పు, కరివేపాకు, పచ్చికొబ్బరి బాగా కలిపి నూనెలో బోండాలా వేసుకోవాలి. వేడినీళ్ల ప్యాన్‌లో బోండాలను వేసి పావు గంట నానబెట్టాలి. పెసరపప్పుకు పసుపు, ఇంగువ జతచేసి కుక్కర్‌లో ఉడికించాలి. ఓ ప్యాన్‌లో ఉడికించిన పెసర పప్పుకు, మూడు గ్లాసుల నీళ్లు, టమాటా ముక్కలు, పచ్చి మిర్చి, అల్లం తరుగు, కరివేపాకు, ఉప్పు జతచేయాలి. పది నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి, స్టవ్‌ కట్టేయాలి. ఇందులో పచ్చి కొబ్బరి, నిమ్మరసం, కొత్తిమీర కలపాలి. ఒక్కో బొండాని బయటికి తీసి, నీళ్లని తొలగించి లోతైన పళ్లెంలో పెట్టాలి. వాటిపైన, చుట్టూ పెసర్ల ద్రావకం వేస్తే బోండా సూప్‌ తయారు.


ఈ వార్తలు కూడా చదవండి:

చందమామ ‘చిన్న’బోతోంది

జీపీ భవనం కోసం అప్పు..సొంత భూమి తనఖా

Read Latest Telangana News and National News

Updated Date - Feb 22 , 2026 | 01:20 PM