బాబోయ్.. పులి.. వరంగల్ జిల్లా కుందారంలో పాదముద్రల గుర్తింపు
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:11 PM
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయలుదేరిన మగ పులి.. వరంగల్ జిల్లా లింగాలఘణపురం మండలం కుందారం శివారుకు చేరుకున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
ట్రాకర్‌తో కచ్చితమైన కదలికల కోసం అన్వేషణ
కెమెరా ట్రాప్స్.. థర్మల్ డ్రోన్‌లతో పరిశీలన
నిడిగొండ వైపు వెళ్లినట్లు అధికారుల వెల్లడి
లింగాలఘణపురం(వరంగల్): మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయలుదేరిన మగ పులి లింగాలఘణపురం మండలం కుందారం శివారుకు చేరుకున్నట్లు అటవీశాఖాధికారులు గుర్తించారు. బుధవారం రాత్రి కుందారం శివారులో సంచరించినట్లు స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో లింగాలఘణపురం ఎస్సై బండి శ్రవణ్‌కుమార్ వణ్యప్రాణుల సంరక్షణా విభాగానికి సమాచారాన్ని చేరవేశారు. దీంతో గురువారం నాడు కుందారం చేరుకున్న అటవీశాఖాధికారులు పులి తిరిగిన ప్రదేశాన్ని పాదముద్రల (పగ్ మార్క్స్) ఆధారంగా పరిశీలించి పులి సంచరిస్తున్నట్లు నిర్ధారించారు.
వారం పదిరోజులుగా యాదాద్రిభువనగిరి, సిద్ధిపేట జిల్లాలో సంచరించిన పులి.. తాజాగా రెండు రోజుల కిందట జనగామ జిల్లాలోకి ప్ర వేశించింది. మొదట బచ్చన్నపేట మండలంలోకి ప్రవేశించి తిరిగి యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు, శారాజీపేట మీదుగా జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం జీడికల్ నుంచి బుధవారం నాటికి కుందారం శివారులోకి ప్రవేశించింది. అప్పటికే పగ్‌మార్క్స్ ద్వారా పులి ట్రాకర్‌ను పరిశీలిస్తున్న అటవీశాఖాధికారులు.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కచ్చితమైన కదలికలను తెలుసుకునేందుకు కెమెరా ట్రాప్స్, థర్మల్ డ్రోన్స్‌తో అన్వేషిస్తుండటం గమనార్హం.
కాగా, పులి సంచారం నేపథ్యంలో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి ఎక్కడి నుంచి ఎటు వైపు వెళ్తుందో అర్థంకాక బావుల వద్ద ఉన్న డెయిరీ ఫామ్‌లు, పాడిగేదెలతో పాటుగా ఇతర ప శువులను కాపాడుకునేందుకు రైతులు కంటిమీద కును కు లేకుండా అష్టకష్టాలు పడుతున్నారు. అయితే కుందారం మీదుగా రఘునాథపల్లి మండలం నిడిగొండ వైపుకు పులి వెళ్లినట్లు పాదముద్రల ఆధారంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కొండల్‌రెడ్డి నిర్ధారించారు.
మరోవైపు పులికి ఎలాంటి హాని కలగకుండా ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోకుండా సురక్షితంగా పులిని బంధించేందుకు అటవీశాఖాధికారులు శ్రమిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా నిడిగొండ, శ్రీమన్నారాయణపురం, బానాజీపేట, రఘునాథపల్లి, కన్నాయిపల్లి, గబ్బెట గ్రామాల్లో టాంటాం వేయించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు సయ్యద్ ఇజాజ్ అహ్మద్, రమేశ్, లింగాలఘణపురం బీట్ ఆఫీసర్ రమేశ్, సెక్షన్ ఆఫీసర్ శోభారాణితో పాటుగా టైగర్ ట్రాకర్స్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
సినిమాలు తక్కువ.. గాసిప్స్ ఎక్కువ
భాస్కరా అవార్డులాగా కేసీఆర్‌కు జాతిపితనా..!
Read Latest Telangana News and National News