Share News

కేసీఆర్‌ది ఫ్యామిలీ జస్టిస్.. నాది సోషల్ జస్టిస్: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Aug 16 , 2026 | 07:06 PM

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై, బీఆర్‌ఎస్ పార్టీ రాజకీయ వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హనుమకొండ జిల్లా పరకాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాల విమర్శలను తీవ్రంగా తిప్పికొట్టారు.

కేసీఆర్‌ది ఫ్యామిలీ జస్టిస్.. నాది సోషల్ జస్టిస్: సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy

హనుమకొండ, ఆగస్టు 16: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై, బీఆర్‌ఎస్ పార్టీ రాజకీయ వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హనుమకొండ జిల్లా పరకాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాల విమర్శలను తీవ్రంగా తిప్పికొట్టారు. 'వెయ్యిమంది కేసీఆర్‌లు ఏకమై వచ్చినా తనను ఏమీ చేయలేరని' అని సీఎం వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలన కేవలం తన కుటుంబ శ్రేయస్సుకు సంబంధించిన 'ఫ్యామిలీ జస్టిస్' అయితే, తమ కాంగ్రెస్ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే 'సోషల్ జస్టిస్' అని స్పష్టం చేశారు.


గత ఉద్యమకాలాన్ని గుర్తుచేస్తూ.. 'అగ్గిపెట్టె అఘోరా రావు పెట్రోల్ పోసుకుని విద్యార్థులను రెచ్చగొట్టాడు. కేసీఆర్ కుటుంబం వీధి నాటకాలు ఆడితే యువత ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారు' అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి మళ్లీ బలి తీసుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంపై విమర్శలు గుప్పిస్తూ.. 'కార్యకర్తలు ఇచ్చిన రక్తాన్ని కూడా ప్రైవేట్ ఆస్పత్రులకు అమ్ముకున్న రక్తం పీల్చే రక్తపిపాసులు వారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


యువత, నిరుద్యోగులు రాజకీయంగా ఎవరి ప్రచారాలకు లోనుకావద్దని కోరారు. 'నిరుద్యోగుల కోసం ఉద్యోగాల నియామకాలు చేపడతాం, శ్రద్ధగా చదువుకోండి. ఆ రాక్షసుల మాటలు నమ్మి మోసపోవద్దు' అని సీఎం సూచించారు. కేసీఆర్ సీఎం అయితే ఆ ఒక్క కుటుంబానికే లాభం జరుగుతుందని, అదే తాను సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎవరికి పదవులు దక్కాయి, తమ పాలనలో ఎవరికి హోదాలు లభించాయో ప్రజలు బేరీజు వేసుకోవాలని సీఎం కోరారు.


రాష్ట్రంలో ప్రతి అంశంపైనా రాబోయే సెప్టెంబర్ శాసనసభ సమావేశాల్లో సమగ్రంగా చర్చించి అన్ని లెక్కలూ స్పష్టంగా చెప్తానని సీఎం స్పష్టం చేశారు. 'గత పాలనలో బోల్తా పడ్డ రాష్ట్ర బండిని మళ్లీ పట్టాలెక్కించి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నాం. ప్రజలంతా సహకరిస్తే తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్తాం' అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


వార్తలు కూడా చదవండి...

జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు

నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్

నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

Updated Date - Aug 16 , 2026 | 07:22 PM