Share News

కర్రెగుట్టల్లో పేలిన మందుపాతర.. ఒకరి మృతి

ABN , Publish Date - Sep 03 , 2026 | 08:16 AM

ములుగు జిల్లాలోని కర్రెగుట్టల్లో మందుపాతర పేలింది. ఈ ఘటనలో మడకం నాగేశ్వరరావు అనే గిరిజనుడు మృతి చెందాడు.

కర్రెగుట్టల్లో పేలిన మందుపాతర.. ఒకరి మృతి

ములుగు, సెప్టెంబర్ 03: జిల్లాలోని కర్రెగుట్టల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. గతంలో మావోయిస్టులు అమర్చినట్లు భావిస్తున్న మందుపాతర పేలింది. ఈ ఘటనలో గిరిజనుడు మడకం నాగేశ్వరరావు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కర్రెగుట్టలకు చేరుకున్నారు. మృతుడు.. వెదుల్లచెరువు కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వెదురు బొంగుల కోసం గుట్టలపైకి వెళ్లిన సమయంలో ఈ మందుపాతర పేలి ఉంటుందని పోలీసులు తెలిపారు.


గతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను అతడు తొక్కడం వల్లే ఇది పేలి ఉంటుందని భావిస్తున్నారు. నాగేశ్వరరావు మృతితో వెదుల్లచెరువు కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో వైపు ఈ ప్రాంతంలో మరిన్ని మందుపాతరలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు కర్రెగుట్టల్లో తనిఖీలు చేపట్టారు.


గతంలో ఈ ప్రాంతం మావోయిస్టులకు కేంద్రంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఎలక్ట్రిక్ వైర్లు, మందుపాతరలు కనిపిస్తే.. వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు స్పష్టం చేశారు. ఇంకో వైపు.. ఈ ఏడాది ప్రారంభంలో కర్రెగుట్టలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను గుర్తించి.. వాటిని నిర్వీర్యం చేసేందుకు భద్రతా బలగాలు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా మందుపాతర పేలింది. ఈ ఘటనలో ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ఏరియాలు..

మూసీ వెంట భూగర్భ ఎస్టీపీ!

For More TG News And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 09:04 AM