మూసీ వెంట భూగర్భ ఎస్టీపీ!
ABN , Publish Date - Sep 03 , 2026 | 08:05 AM
మూసీనదిని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. నదిలో చేరే మురుగును శుద్ధి చేసేందుకూ సరికొత్త పద్ధతిని అవలంబించే యోచనలో ఉంది.
నది వెంట నిర్మించే యోచనలో ప్రభుత్వం
దక్షిణ కొరియాలో పలుచోట్ల భూగర్భంలో ఎస్టీపీలు
వాటిపై అమ్యూజ్‌మెంట్ పార్కులు, క్రీడా స్టేడియాలు
అదే తరహాలో మూసీ వెంట నిర్మాణానికి చర్యలు
అత్తాపూర్ ప్రాంతంలో ఎస్టీపీ నిర్మించే యోచన
అధ్యయనం చేస్తున్న వాటర్‌బోర్డు అధికారులు
హైదరాబాద్ సిటీ: మూసీనదిని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. నదిలో చేరే మురుగును శుద్ధి చేసేందుకూ సరికొత్త పద్ధతిని అవలంబించే యోచనలో ఉంది. మురుగును శుద్ధి చేసే సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ను భూమిపై కాకుండా.. భూగర్భంలో నిర్మించాలని యోచిస్తోంది. దక్షిణ కొరియాలో నిర్మించిన భూగర్భ ఎస్టీపీల తరహాలో వీటి నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం వాటర్‌బోర్డు ఉన్నతాధికారుల బృందాన్ని దక్షిణ కొరియా దేశానికి పంపించి అధ్యయనం చేయిస్తోంది.
సాధారణంగా.. ఎస్టీపీ నిర్మాణం జరిపితే దానినుంచి వచ్చే దుర్వాసన, చుట్టూ పేరుకుపోయే ఈగలు, దోమలు, మురుగుతో నిండిన పెద్ద పెద్ద ట్యాంకులు తీవ్రంగా కంపుకొడుతుంటాయి. దీంతో నివాస ప్రాంతాల మధ్య ఎస్టీపీ నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తుంటారు. పైగా, ఎస్టీపీ నిర్మాణానికి పెద్ద ఎత్తున స్థలం అవసరమవుతుంది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం భూగర్భ ఎస్టీపీల విధానాన్ని తీసుకొచ్చింది. జనాభా ఎక్కువగా ఉండడం, స్థలం తక్కువగా ఉండడంతో.. ఒకే స్థలాన్ని రెండు రకాలుగా వినియోగించే పద్ధతిని ప్రవేశపెట్టింది. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా భూగర్భంలో ఎస్టీపీ నిర్మించి అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నది.
భూమి కింద ఎస్టీపీ.. పైన పార్కు
దక్షిణ కొరియాలో భూగర్భంలో నిర్మించిన ఎస్టీపీల్లో.. భూమి కింద అత్యాధునిక మురుగునీటి శుద్ధి యంత్రాలు, వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటాయి. వాటిపై పార్కులు, క్రీడా స్టేడియాలు, పిల్లల ఆటస్థలాలు, స్విమ్మింగ్ పూల్స్, వాటర్ అమ్యూజ్‌మెంట్ పార్కులు ఏర్పాటు చేశారు. బయటి నుంచి చూస్తే అది పర్యాటక ప్రాంతంగా కనిపిస్తుంది. భూమి కింద మాత్రం మిలియన్ లీటర్ల మురుగును శుద్ధి చేసే ప్లాంట్ ఉంటుంది. ఇక మురుగును శుద్ధి చేసినప్పుడు వచ్చే దుర్వాసనను బయటకు పంపేందుకు భారీ చిమ్నీలు ఏర్పాటు చేశారు.
దుర్వాసన రాకుండా కూడా కట్టడి చేశారు. మురుగును శుద్ధి చేయడమే కాకుండా దాని నుంచి వెలువడే వ్యర్థాల ద్వారా మీథేన్ గ్యాస్‌తో గ్రీన్ విద్యుత్‌ను తయారు చేస్తారు. ఈ విద్యుత్‌ను తిరిగి అదే ప్లాంట్ నడవడానికి వాడుకోవడం వల్ల కొరియా ప్రభుత్వానికి కోట్ల రూపాయల కరెంట్ బిల్లులు ఆదా అవుతున్నాయి. అక్కడి హనామ్ యూనియన్ పార్క్ అనే ఎస్టీపీని నివాస గృహాల మధ్యలోనే భూగర్భంలో దాదాపు నాలుగు అంతస్తుల లోతులో నిర్మించారు. ప్లాంట్ లోపల నుంచి వచ్చే గాలిని శుద్ధి చేసి బయటకు వదిలేందుకు 105 మీటర్ల ఎత్తైన చిమ్నీ నిర్మించారు. దీని చుట్టూ గ్లాస్ వేసి.. అబ్జర్వేటరీ టవర్‌గా ఏర్పాటు చేశారు. పర్యాటకులు టికెట్ కొనుక్కొని మరీ పైకి వెళ్లి.. అక్కడి నుంచి అందమైన నదిని, కొండలను, పట్టణాన్ని వీక్షిస్తుంటారు. ఇదే తరహాలో అన్యాంగ్ బాక్డాల్ ప్లాంట్, యోంగిన్ సుజి రెస్పియా అనే భారీ ఎస్టీపీలను భూగర్భంలో నిర్మించారు.
మూసీని పర్యావరణ హితంగా మార్చేందుకు..
మూసీనదిని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూసీనది తీర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు మురుగును శుద్ధి చేయడం అత్యంత కీలంగా మారింది. ఇప్పటికే మూసీనది వెంట ఎస్టీపీలను అత్తాపూర్, అంబర్‌పేట, నాగోల్ ప్రాంతాల్లో వందల ఎకరాల్లో నిర్మించారు. అయితే వీటిని భూమిపై నిర్మించడం వల్ల దుర్వాసన రావడంతోపాటు పెద్దఎత్తున భూమిని వినియోగించాల్సి వస్తుంది. దీంతో ఎకరం కోట్ల రూపాయల ధర పలుకుతున్న మహా నగరంలో ఎస్టీపీల కోసం భూమిని సేకరించడం సమస్యగా మారింది.
ఈ పరిస్థితుల్లో దక్షిణ కొరియా తరహా భూగర్భ ఎస్టీపీల విధానం పరిష్కార మార్గంగా కనిపిస్తోంది. మూసీనది వెంట భూగర్భంలో ఎస్టీపీ నిర్మించి.. దానిపై వాటర్ అమ్యూజ్‌మెంట్ పార్కులను ఏర్పాటు చేస్తే పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. దీంతో మూసీనది వెంట అత్తాపూర్ ప్రాంతంలో ఎస్టీపీని భూగర్భంలో నిర్మించాలని యోచిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు అధికారుల బృందం దక్షిణ కొరియాలో పర్యటించిన సందర్భంలో దీనిని గుర్తించారు. ఆ దేశానికి చెందిన ఓ కంపెనీ ప్రతినిధులు కూడా మూసీనది వెంట భూగర్భంలో ఎస్టీపీ నిర్మించడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే వాటర్‌బోర్డు అధికారులు దక్షిణ కొరియాలో పర్యటించి భూగర్భ ఎస్టీపీ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తున్నారు.
దక్షిణ కొరియాలో అధికారుల అధ్యయనం
దక్షిణ కొరియాలో అత్యాధునికంగా నిర్మించిన భూగర్భ ఎస్టీపీలను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రానికి చెందిన ఉన్నతస్థాయి అధికారుల బృందం అధ్యయనం చేస్తోంది. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. ఈ బృందంలో వాటర్‌బోర్డు ఎండీ కె.అశోక్‌రెడ్డి, ఎంఆర్‌డీసీఎల్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, వాటర్‌బోర్డు సీజీఎం సుజాత, డీజీఎం శివ, ఎంఆర్డీసీఎల్ ఈఈ జాకీర్ హుస్సేన్ ఉన్నారు. బుధవారం వీరు గ్వాంగ్ మియాంగ్‌లోని 250 ఎంఎల్‌డీ సామర్థ్యం గల అత్యాధునిక భూగర్భ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు.
దీంతోపాటు చియోంగ్ గ్యేచియోన్ పట్టణ నది పునరుజ్జీవ ప్రాజెక్టునూ సందర్శించారు. నదిలో నీటి నాణ్యత పెంపు, ఎగువ-దిగువ స్థాయుల్లో ఏర్పాటు చేసిన ప్రొమెనేడ్‌లు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన రివర్‌ఫ్రంట్ ప్రాంతాలను అధ్యయనం చేశారు. ఇక అన్యాంగ్ పబ్లిక్ ఎస్టీపీ, సియోల్‌లోని హాన్ నది కారిడార్, ప్యోంగ్‌టెక్‌లోని గోడెక్ పబ్లిక్ వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోని వివిధ దశలను అధికారులు పరిశీలించారు. కేఐఎన్‌డీ ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 4 వరకు అక్కడ పర్యటించిన అనంతరం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కొనసాగుతున్న ధరల పతనం.. 3 రోజుల్లో రూ.6 వేల పైచిలుకు మేర తగ్గుదల
జాతీయ జలభద్రతకు ఏకీకృత కార్యాచరణ
Read Latest AP News And Telangana News And International News And Telugu News