ఎఫ్ఎస్‌ఎల్‌లో అగ్నిప్రమాదంపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలి: కేటీఆర్
ABN , Publish Date - Feb 08 , 2026 | 07:02 PM
ఓటుకు నోటు కేసు చివరి దశకు వచ్చిన తరుణంలో తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో అగ్నిప్రమాదం జరగడంపై కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. ఈ అగ్నిప్రమాదంపై స్పందించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
హనుమకొండ, ఫిబ్రవరి 08: హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డితో బీజేపీకి లాలూచీ లేకపోతే దర్యాప్తు చేయించాలని ప్రభుత్వానికి కేటీఆర్ సూటిగా సవాల్ విసిరారు. ఆదివారం హనుమకొండలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎఫ్ఎస్ఎల్‌లో అగ్నిప్రమాదం సీఎం రేవంత్ పనేనని ఆరోపించారు. చలికాలంలో ఎక్కడైనా అగ్నిప్రమాదాలు జరుగుతాయా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. పక్కా ప్రణాళికతో ఆధారాలు మాయం చేసేందుకు కుట్ర జరిగిందన్నారు. ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ తూతూమంత్రంగా వివరణ ఇచ్చారంటూ మండిపడ్డారు.
ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే ఇలా చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అంతా బిజీగా ఉన్న సమయంలో కుట్ర చేశారని విమర్శించారు. ముడంతస్తుల భవనంలో మంటలార్పేందుకు 3 గంటల సమయం పడుతుందా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ అగ్నిప్రమాదం జరిగినప్పుడు కార్యాలయంలో విధుల్లో ఎవరూ లేకపోవడమేంటని ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. సీఎం కింద ఉన్న శాఖలో ఇలా జరగడమంటే.. ఏమనుకోవాలన్నారు. విచారణ చివరి దశకు రావడంతో సాక్ష్యాలు మాయం చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలకు తెలిసిందన్నారు. 2015లో కెమెరాల ముందు నగదుతో దొరికింది రేవంత్ రెడ్డి కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. జై తెలంగాణ అని నినాదం చేయని వ్యక్తి.. న్యూఢిల్లీలో నగదు బ్యాగ్‌లు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాడంటూ వ్యంగ్యంగా అన్నారు. పోలీసులను ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిగా వాడుకుంటున్నారని సీఎం రేవంత్ వైఖరిపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఓ పారిశ్రామికవేత్తను బెదిరింపులకు గురి చేశారని ఆరోపించారు.
ఓటుకు నోటు కేసు చివరి దశకు వచ్చిన తరుణంలో ఈ అగ్నిప్రమాదం జరగడంపై ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై స్పందించాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కీలకమైన అనేక కేసుల ఆధారాలు ఈ మంటల్లో కాలిపోయాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసు నుంచి బయటపడేందుకే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం చేయించారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య బడే భాయ్ చోటే భాయ్ సంబంధం లేకుంటే న్యాయవిచారణ జరపాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని కీలక నేతల సూచనతోనే సుఫారి తీసుకొని రేవంత్ రెడ్డి ఈ విధంగా చేయించారా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భూపాలపల్లిలో అన్ని సీట్లు గెలవాలి: సీఎం రేవంత్
జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..