Share News

భూపాలపల్లిలో అన్ని సీట్లు గెలవాలి: సీఎం రేవంత్

ABN , Publish Date - Feb 08 , 2026 | 05:15 PM

మున్సిపల్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలం చెల్పూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు.

భూపాలపల్లిలో అన్ని సీట్లు గెలవాలి: సీఎం రేవంత్
CM Revanth Reddy In Bhupalpally

జయశంకర్-భూపాలపల్లి, ఫిబ్రవరి 08: జీవిత కాలం పని చేసినా ఒక్కొక్కసారి పార్టీ టికెట్ రాదని.. అలా వస్తే అదే పెద్ద గుర్తింపు అని భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ బీ ఫారం వస్తే గెలుస్తామన్న వాతావరణం భూపాలపల్లిలో ఉందని వారికి తెలిపారు. ఆదివారం నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలం చెల్పూర్‌లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద భూపాలపల్లి బరిలో దిగిన అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో సీఎం మాట్లాడుతూ.. టికెట్ రాని వాళ్లకు ఆవేదన ఉంటుందన్నారు. వారితో సమన్వయం చేసుకొని పోవాలంటూ అభ్యర్థులకు సూచించారు. టికెట్ కోసం పోటీపడిన వాళ్లను నిర్లక్ష్యం చేయెుద్దంటూ హితవు పలికారు.


టికెట్ రాని వాళ్లను పార్టీ వదిలేయదని.. వాళ్లకు కాంగ్రెస్ న్యాయం చేస్తుందని వివరించారు. ఓటర్లను ఒకటికి నాలుగు సార్లు కలవాలని అభ్యర్థులకు స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకం కలిగించిన వాళ్లకే ప్రజలు ఓట్లు వేస్తారని తెలిపారు. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి ఓటు అడగాల్సి ఉందన్నారు. కార్యకర్తల కోసం నాయకులు కష్టపడాల్సి ఉందని చెప్పారు. పార్టీని గెలిపించుకొని పనులు చేయించుకోవాలని అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. భూపాలపల్లిలో అన్ని సీట్లు గెలవాలంటూ అభ్యర్థులను ఆదేశించారు. పట్టణాభివృద్ధికి నిధులు మంజూరు చేసే బాధ్యత తనదని అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సభలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులతోపాటు స్థానిక ఎంపీ పాల్గొన్నారు.


అబద్ధాలు పుట్టిందే బీఆర్ఎస్ పార్టీతో.. : ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి జిల్లా పోతుందంటూ మున్సిపల్ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ అభ్యర్థులు అబద్ధాలు చెబుతున్నారంటూ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మండిపడ్డారు. అబద్ధాలు పుట్టిందే బీఆర్ఎస్ పార్టీతో అని ఆయన ఎద్దేవా చేశారు. పాత రేషన్ కార్డులో పేర్లు ఎక్కించలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉందని గుర్తు చేశారు. సింగరేణి కార్మికుల్లో సుమారు 200మంది డిస్మిసయ్యారని వారికి తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చేయాలని స్పష్టం చేశారు.


మహిళలను కోటీశ్వరులు చేయడమే సీఎం రేవంత్ లక్ష్యం: ఎంపీ కడియం కావ్య

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని వరంగల్ ఎంపీ కడియం కావ్య స్పష్టం చేశారు. అలాగే భూపాలపల్లికి రైల్వే లైన్ కావాల్సి ఉందన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వంలో ఉన్న వారికి ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు.


కొత్త భూభారతి చట్టంలో భూ సమస్యలు ఉండవు: మంత్రి పొంగులేటి

సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏప్రిల్‌లో కేబినెట్‌లో నిర్ణయం తీసుకొని 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభిస్తామన్నారు. అర్హులైన పేదవారికి 100 శాతం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో చాలా చోట్ల భూములకు సరైన పత్రాలు లేవని తెలిపారు. కొత్త భూభారతి చట్టం ప్రకారం ఎటువంటి భూ సమస్య లేకుండా చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. మీకు సంక్షేమ పథకాలు అందజేయడం వల్లే సర్పంచ్ ఎన్నికల్లో 68 శాతానికి పైగా గెలిచారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భూపాలపల్లిలో అన్ని సీట్లు గెలవాలి: సీఎం రేవంత్

జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..

For More TG News And AP News

Updated Date - Feb 08 , 2026 | 07:08 PM