Share News

జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..

ABN , Publish Date - Feb 08 , 2026 | 04:26 PM

జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు మరో వీడియో విడుదల చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు ఆ పార్టీ నేతలకు కొన్ని ప్రశ్నలు సంధిస్తూ నాగబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా ఈ పోస్ట్ చేశారు.

జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..
Janasena MLC Nagababu

అమరావతి, ఫిబ్రవరి 08: కులం అనేది బై బర్త్.. కానీ బై ఛాయిస్ కాదని జనసేన పార్టీ ఎమ్మెల్సీ కె.నాగబాబు స్పష్టం చేశారు. కానీ ఎలా బతకాలో మనం నిర్ణయించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ప్రాక్టికల్‌గా ఉంటూ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. ఆదివారం నాడు తన ఎక్స్ ఖాతా వేదికగా వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ నాగబాబు.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు ఆ పార్టీ నేతలకు పలు ప్రశ్నలు సంధించారు. ఆయన ఏమన్నారంటే.. ‘పెద్ద సంఖ్యలో ఉన్న కులాలు.. చిన్న సంఖ్యలో ఉన్న కులాల వారిని ప్రోత్సహించాలని, అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో అధిక శాతం ఉన్న కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ ప్రకటించారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో నలభై శాతం కాపులు ఉన్నప్పటికీ.. బీసీ సోదరుడు కొణతాల రామకృష్ణకు టికెట్ ఇచ్చారు. కాపులు, బీసీలు కలిసి పని చేసి రామకృష్ణను గెలిపించుకున్నారు.’


‘విశాఖపట్నం సౌత్‌లో కూడా కుల సమీకరణలు పక్కన పెట్టి బీసీ యాదవ సోదరుడు వంశీ కృష్ణకి సీటు ఇచ్చారు. కులాలను పక్కన పెట్టి.. అందరూ సమానమనే భావనతో పవన్ ముందుకు సాగుతున్నారు. వైసీపీ నాయకులకు ముని శాపం ఉంది.. వారు నిజాలు చెబితే.. తల వెయ్యి ముక్కలయ్యి చస్తారు. నోరు విప్పితే చాలు.. అబద్దాలు.. బూతులు.. ఇవే వారికి తెలుసు. చిన్న అవకాశం వచ్చినా కులాలను రెచ్చగొట్టి.. కుల రాజకీయాలు చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యమంత్రిని బండ బూతులు తిడితే జైల్లో పెట్టక ముద్దు పెట్టుకుంటారా?. ఇలాంటి వారికి కులాన్ని ఆపాదించి కుల చిచ్చు పెట్టేవారిని కూడా అరెస్టు చేస్తే దరిద్రం వదలిపోతుంది. కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు అని పిచ్చిపిచ్చిగా మాట్లాడే అంబటి రాంబాబు లాంటి వాడిని రంగా బొమ్మ పక్కన రాంబాబు బొమ్మ పెట్టిన వైసీపీ నేతలను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా..? 2024 ఎన్నికలలో గ్రేటర్ రాయలసీమ ప్రాంతాలలో కాపు, బలిజలు 20 శాతం వరకు ఉన్నా ఒక్క ఎంపీ సీటు ఇవ్వలేదు. 74 అసెంబ్లీ సీట్లలో ఒకే ఒక్క సీటు మాత్రమే కాపులకు ఇచ్చారు.’


‘మరి పేర్ని నానీ, అంబటి రాంబాబు వంటి వారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను ప్రశ్నించారా?. రాజంపేట బలిజలు ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు.. సాయి ప్రతాప్ అక్కడ నుంచే కేంద్రమంత్రి అయ్యారు. జగన్ ఆ తర్వాత మిథున్ రెడ్డికి ఈ సీటు ఇస్తే.. టైగర్ అంబటి, లయన్ పేర్ని నానీ ఎక్కడ నిద్రపోయారు?. మీకు అంత ధైర్యం ఉంటే.. అసలు మీరు ఆ పార్టీలో ఎందుకుంటారు. పిఠాపురంలో మిథున్ రెడ్డిని పెట్టి పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు తెగ పాకులాడారు. ఇప్పుడు మిథున్ రెడ్డిని కాకుండా మీతో ఎందుకు మాట్లాడిస్తున్నారు.. మీకు ఆలోచించే బుర్ర ఉందా? అసలు వంగవీటి రంగా ఫొటో పక్కన అంబటి ఫొటో పెట్టమని చెప్పిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. మీ 11 సీట్లలో ఆరు సీట్లు పోయే ఐడియా ఇది. రంగా గారిపై అభిమానం ఉంటే.. వారి అబ్బాయి రాధాకు సీటు ఇవ్వకుండా బయటకు ఎలా పంపారు.’


‘రంగాని తిట్టిన గౌతంరెడ్డికి సీటు ఇవ్వడమే కాకుండా.. ఫైబర్ నెట్ ఛైర్మన్‌ను చేసింది జగన్ కాదా? కాపులు అని చెప్పుకుంటూ... జగన్‌ను సపోర్టు చేసేవారిని ఒక్కటే అడుగుతున్నా.. కాపు నేస్తం పథకానికి జగన్ పేరు పెట్టుకున్నప్పుడు ఈ సో కాల్డ్ కాపులు ఏమయ్యారు?. ఏం జగనన్నా .. మాకు సీకే నాయుడు, కోడి రామ్మూర్తినాయుడు వంటి కాపు లీడర్లు లేరా.. వారి పేర్లు ఎందుకు పెట్టలేదని ఎప్పుడైనా అడిగారా? కాపులను మోసం చేసిన జగన్‌ను ముందు ప్రశ్నించి.. ఆ తర్వాత పవన్‌ను అడగండి. ఇది జెన్‌జీ జనరేషన్.. కుర్రాళ్లు యమ స్పీడుగా ఉన్నారు. మీరు ఇంకా రాంబాబు రాంబాబు అంటూ రాజనాల నాటి రాజకీయమే చేస్తామంటే.. ఈ సారి 11 సీట్లు కూడా రావు..’ అంటూ జనసేన పార్టీ నేత, ఎమ్మెల్సీ కె.నాగబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సైబర్ నేరగాళ్లపై ఉక్కు పాదం.. రూ. 65 కోట్ల లావాదేవీల గుట్టు రట్టు

అంబటి రాంబాబుకు బిగ్ షాక్.. పీటీ వారెంట్ జారీ

For More AP News And AP News

Updated Date - Feb 08 , 2026 | 07:09 PM