సైబర్ నేరగాళ్లపై ఉక్కు పాదం.. రూ. 65 కోట్ల లావాదేవీల గుట్టు రట్టు
ABN , Publish Date - Feb 08 , 2026 | 02:29 PM
సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 26 కీలక సైబర్ క్రైమ్ కేసులను ఛేదించారు. ఒక్క జనవరిలోనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో 117 ఎఫ్ఐఆర్‌లు నమోదు కావడం గమనార్హం.
హైదరాబాద్, ఫిబ్రవరి 08: ప్రజల నుంచి వివిధ మార్గాల్లో అక్రమంగా నగదు చోరీ చేస్తున్న సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి అంటే.. జనవరి నుంచి నగర పోలీసులు ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టారు. ఈ నేరాలకు పాల్పడుతున్న ఏడు రాష్ట్రాలకు చెందిన 37 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 26 కీలక సైబర్ క్రైమ్ కేసులను పోలీసులు ఛేదించారు. ఒక్క జనవరిలోనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో 117 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆ జాబితాలో ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు 15, డిజిటల్ అరెస్ట్ 2, సోషల్ మీడియా 4, బిజినెస్, గేమింగ్, జాబ్ ఫ్రాడ్స్‌కు సంబంధించి 5 కేసులు ఉన్నాయి.
ఇక నగర పోలీసుల సత్వర చర్యలతో రూ.71.91 లక్షల రిఫండ్‌ను బాధితులకు అందజేశారు. ఈ ఆపరేషన్ ద్వారా రూ.65 కోట్ల లావాదేవీల గుట్టురట్టు అయినట్లు సమాచారం. అలాగే సైబర్ క్రైమ్ కేసుల్లో అరెస్టయిన నిందితులకు దేశవ్యాప్తంగా 85 కేసులతో సంబంధముందని నగర పోలీసులు గుర్తించారు. అంటే నిందితుల బ్యాంక్ ఖాతాల్లో రూ.65 కోట్ల మేర భారీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 26 మొబైల్ ఫోన్లు, 79 సిమ్ కార్డులు, 62 డెబిట్ కార్డులు, 57 చెక్ బుక్స్‌తోపాటు భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకుని పోలీసులు సీజ్ చేశారు.
ఈ సైబర్ ఆపరేషన్‌లో కీలకమైన మ్యాట్రిమోనీ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసును సైతం నగర పోలీసులు ఛేదించారు. యూకే ఇంజనీర్‌గా నటించి బాధితుడి నుంచి రూ.11.20 లక్షలు మహిళా నిందితురాలు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు జనవరిలో సీ మిత్ర ద్వారా 315 ఎఫ్ఐఆర్‌లు పోలీసులు నమోదు చేశారు. మరో 13 మంది నిందితుల అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి రూ.10.65 లక్షలను హైదరాబాద్ నగర పోలీసులు రికవరీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎఫ్ఎస్ఎల్‌లో అగ్ని ప్రమాదంపై దుష్ప్రచారం: శిఖాగోయల్
మంచు విష్ణుకు పోలీసుల నోటీసులు.. ఏ2గా నమోదు..
Read Latest Telangana News And AP News