కాజీపేట రైల్ తయారీ కేంద్రంలో.. త్వరలో ఉత్పత్తి ప్రారంభం!
ABN , Publish Date - May 28 , 2026 | 08:42 PM
కాజీపేట రైల్ తయారీ కేంద్రం పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో ఈ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభం కానుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఉన్నతాధికారులు వివరించారు.
న్యూఢిల్లీ, మే 28: కాజీపేట రైల్ తయారీ కేంద్రం (Kazipet RMU) పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో ఈ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభం కానుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఉన్నతాధికారులు వివరించారు. గురువారం ఢిల్లీలో రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టుతో కలిసి అశ్వినీ వైష్ణవ్ ఈ ప్రాజెక్టు పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రైల్ తయారీ కేంద్రంపై కేంద్ర మంత్రులకు ఉన్నతాధికారులు కీలక సమాచారం అందించారు. రానున్న ఐదేళ్లలో ఈ కేంద్రం నుంచి 200 ఆధునిక ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా 20 కోచ్‌ల కాన్ఫిగరేషన్‌తో ఈ రైళ్లను డిజైన్ చేసినట్లు చెప్పారు. అలాగే బ్రేక్ వేసినప్పుడు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఈ నూతన రైళ్లు నడవనున్నాయని వారికి తెలిపారు. ఈ సరికొత్త ఇంటర్‌సిటీ రైళ్లు.. వివిధ నగరాల మధ్య సుమారు 300 కిలోమీటర్ల పరిధిలో తక్కువ దూరం ప్రయాణించేలా అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి కోచ్‌లో ఆటోమేటిక్ డోర్స్, మెరుగైన వెంటిలేషన్‌తోపాటు రెండు చివర్ల బయో టాయిలెట్లు ఉండే విధంగా బోగిలను రూపొందిస్తున్నట్లు వివరించారు. కుదుపులు లేని సురక్షిత ప్రయాణం కోసం ఆధునిక కప్లర్స్, బోగీలను అమర్చనున్నారని తెలిపారు. కాజీపేటలో ఈ అనుబంధ రైల్వే పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానికులకు భారీగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతం ఇస్తుందనే చర్చ సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒకప్పుడు పరదాల పాలన... ఇప్పుడు ప్రజల పాలన: సీఎం చంద్రబాబు
ఆ విషయాన్ని నమ్మిన నాయకుడు సీఎం చంద్రబాబు: కేంద్ర మంత్రి పెమ్మసాని
For More TG News And Telugu News