భర్తను చంపించి.. ఆత్మహత్యగా చిత్రీకరించి..
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:41 AM
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపించాలి.. అలా అని తన చేతికి మట్టి అంటుకోకూడదు! ఎలా? అని ఆలోచించి ప్రియుడితో కలిసి పథకం వేసిందా మహిళ! అనుకున్నట్టుగానే భర్తను చంపించింది.. అది బలవన్మరణంగా చిత్రీకరించేందుకూ ప్రయత్నించింది.
ఓ ఇల్లాలి దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే..
ప్రియుడు, మరో వ్యక్తి సహకారం పురుగుల మందు కలిపిన మద్యం తాగించి హత్య
బలవన్మరణమని నమ్మించే యత్నం హత్యేనంటూ మృతుడి తల్లి ఫిర్యాదు
గణపురం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపించాలి.. అలా అని తన చేతికి మట్టి అంటుకోకూడదు! ఎలా? అని ఆలోచించి ప్రియుడితో కలిసి పథకం వేసిందా మహిళ! అనుకున్నట్టుగానే భర్తను చంపించింది.. అది బలవన్మరణంగా చిత్రీకరించేందుకూ ప్రయత్నించింది. దాదాపు అంతా నమ్మేశారు కూడా! అయితే చివరికి మాత్రం ‘చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు’ అన్న మాటే నిజమైంది. ఆమె మాత్రమే కాదు.. హత్యకు సహకరించిన ప్రియుడు, మరో వ్యక్తి కూడా ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఈ ఘటన జరిగింది. డీఎస్పీ సంపత్‌రావు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ మండల పరిధిలోని గొల్లపల్లికి చెందిన పెండల సంపత్(32) ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం ఇదే మండలంలోని బుద్దారం గ్రామానికి చెందిన సుమలతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. కుటుంబంతో కలిసి సంపత్ బుద్దారంలోని అత్తగారింట్లోనే ఉంటున్నాడు. కొన్నాళ్లుగా గ్రామానికి చెందిన ఉమ్మల శ్రీకాంత్‌తో సుమలతకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ విషయంలో సంపత్, సుమలత మధ్య గొడవలు జరిగాయి. సంపత్‌ను అడ్డుతొలగించుకుంటే సంతోషంగా ఉండొచ్చునని ప్రియుడు శ్రీకాంత్‌తో కలిసి సుమలత పథకం వేసింది. ఇద్దరూ కలిసి సంపత్‌ను హత్య చేసేందుకు గ్రామానికి చెందిన పోలుదాసరి తరుణ్ అనే యువకుడి సహకారం కోరారు. హత్యకు సహకరిస్తే రూ.లక్ష ఇస్తామని చెప్పడంతో అతడు అంగీకరించాడు. పథకం ప్రకారం సెప్టెంబరు 17న రాత్రి శ్రీకాంత్, తరుణ్ కలిసి సంపత్‌ను మద్యం తాగుదామని ఆఫర్ చేశారు. అతడిని గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల మైదానానికి తీసుకెళ్లారు. అక్కడ పురుగుల మందు కలిపిన మద్యాన్ని సంపత్‌తో తాగించారు. కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతతో సంపత్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని బైక్ మీద ఇంటికి తరలించారు. అక్కడ సుమలత, శ్రీకాంత్, తరుణ్ కలిసి మృతదేహం నోరు, దుస్తులు, నేలపై పురుగుల మందు చిలకరించారు.
మొత్తంగా సంపత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీన్ క్రియేట్ చేశారు. అనంతరం శ్రీకాంత్, తరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి సుమలత గొల్లపల్లిలోని సంపత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన భర్త పురుగుల మందు తాగి చనిపోయాడని నమ్మించింది. పోలీసులు కూడా తొలుత ఆత్మహత్యగానే భావించారు. మృతదేహానికి పోస్టుమార్టం కూడా పూర్తయింది. అయితే సంపత్ తల్లి తన కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. తన కొడుకు ఆత్మహత్య చేసుకోలేదని.. అతడిది హత్యేనని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులోకి దిగగానే నిందితులు హడలిపోయారు. పెద్దల సమక్షంలో పోలీసులకు లొంగిపోయారు. సుమలత, శ్రీకాంత్,సంపత్‌ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి...
కొత్త టీమ్‌తో అమిత్ షా భేటీ!
నేటినుంచి అందుబాటులోకి మెగా ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్
Read Latest Telangana News And Telugu News