కాంట్రాక్టర్‌పై రెచ్చిపోయిన భూపాలపల్లి కలెక్టరేట్ ఉద్యోగి..
ABN , Publish Date - Mar 27 , 2026 | 08:21 PM
భూపాలపల్లి కలెక్టరేట్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కాంట్రాక్టర్‌పై కలెక్టరేట్ ఉద్యోగి దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అడిగేందుకు కలెక్టర్ కార్యాలయానికి కాంట్రాక్టర్ వీరేందర్ వెళ్లాడు.
జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి కలెక్టరేట్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కాంట్రాక్టర్‌పై కలెక్టరేట్ ఉద్యోగి దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అడిగేందుకు కలెక్టర్ కార్యాలయానికి కాంట్రాక్టర్ వీరేందర్ వెళ్లాడు. అసిస్టెంట్ పే అకౌంట్ ఆఫీసర్ (ఏపీఏవో) ఫణి భూషణ కశ్యప్‌ను కలిసి తన గోడు వెల్లబోసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నానని పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరాడు.
బిల్లులు చెల్లించాలని అడిగిన అతనిపై బూతు పురాణం మెుదలెట్టారు కశ్యప్. కలెక్టరేట్‌లో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న విషయం మరిచి వీధి రౌడీలా బూతులు తిట్టడం మెుదలెట్టారు. అది చాలదన్నట్లు టేబుల్‌పై ఉన్న వస్తువులతో కాంట్రాక్టర్‌పై ఏపీఏవో దాడి చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్‌కు ముఖానికి గాయాలు అయ్యాయి. భూపాలపల్లి కలెక్టరేట్ ఉద్యోగి తనపై దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
బిల్లులు క్లియర్ చేయకుండా కాంట్రాక్టర్లను ఏపీఏవో ఫణి భుషణ కశ్యప్ వేధిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ప్రశ్నిస్తే దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోనూ బిల్లులు చెల్లించకపోవడంతో సదరు అధికారిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చాడు వీరేందర్. దాన్ని మనసులో పెట్టుకుని ప్రస్తుత బిల్లులను ఇవ్వకుండా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని అడిగినందుకే దాడి చేశారంటూ కాంట్రాక్టర్ వీరేందర్ తెలిపాడు.
ఈ వార్తలు కూడా చదవండి
గోల్డ్ మ్యాన్‌ను 12 గంటల పాటు విచారించిన ఐటీ అధికారులు..
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న జెండా ఆవిష్కరణ