Share News

వికారాబాద్ జిల్లాలో మహిళ అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్.. అడవిలో హత్య చేసి..

ABN , Publish Date - Oct 04 , 2026 | 08:02 AM

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో మిస్సింగ్ కేసుగా నమోదైన మహిళ అదృశ్యం వెనుక దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

వికారాబాద్ జిల్లాలో మహిళ అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్.. అడవిలో హత్య చేసి..
Kulcharla Crime

వికారాబాద్, అక్టోబర్ 4: జిల్లా కుల్కచర్ల మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన గంధం అమృతమ్మ (34) అదృశ్యం కేసు దారుణ హత్యగా మారింది. సెప్టెంబర్ 18న అమృతమ్మ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అమృతమ్మతో సన్నిహితంగా ఉండే మంగలి ఆనంద్‌పై అనుమానం రావడంతో పోలీసులు విచారించారు. ప్రాథమిక విచారణలో అమృతమ్మను తానే హత్య చేసినట్లు ఆనంద్ అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నగలు తాకట్టు పెట్టడంపై ఇద్దరి మధ్య తలెత్తిన గొడవలే హత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలినట్లు తెలిపారు.


పోలీసుల వివరాల ప్రకారం.. అమృతమ్మను వెన్నచేడ్ అడవిలో హత్య చేసిన ఆనంద్.. అనంతరం మృతదేహానికి నిప్పంటించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత మృతదేహానికి సంబంధించిన అవశేషాలను దేవసూర్ సమీపంలోని నదిలో పడేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా నదిలో గాలింపు చేపట్టిన పోలీసులు మహిళకు సంబంధించిన మృతదేహ అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఇవీ చదవండి:

పర్వతాలు.. శిఖరాలు.. సరస్సులు.. లద్దాఖ్‌లో 28 ప్రాంతాలకు అధికారిక గుర్తింపు

ఏపీ మీదుగా మరో వందేభారత్‌ స్లీపర్‌‌.. హాల్ట్స్ ఇవే?

Updated Date - Oct 04 , 2026 | 09:39 AM