జలజగడాలకు చెక్!
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:19 AM
తుంగభద్ర నదీ జల వివాద పరిష్కారం కోసం కేంద్రం నేతృత్వంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులతో ‘హైలెవల్ కమిటీ (ఉన్నత స్థాయి కమిటీ)’ వేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ప్రకటించారు.....
తుంగభద్ర సమస్యలపై హైలెవల్ కమిటీ
కేంద్రం ఆప్షన్లు ఇస్తుంది
వాటిలో మంచివి ఎంచుకోండి
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సూచన
దేశంలో డ్యాంల పూడికతీతకు భారీ ప్రణాళిక
నదుల అనుసంధానంతో మోదీ భారత్‌ను ఏకతాటిపైకి తెస్తారని వ్యాఖ్య
ఇచ్చిపుచ్చుకుంటేనే ప్రయోజనం: చంద్రబాబు
తుంగభద్రలో 16 టీఎంసీల వాటాలో ఐదే వాడగలుగుతున్నాం.. పరిష్కారం చూపండి
తుంగభద్ర గేట్ల ఆధునికీకరణతో 3 తరాల నీటి సమస్యకు పరిష్కారం: రేవంత్
రైతుల కోసం సమన్వయంతో పనిచేస్తాం: డీకే
గతంలో మైసూరు మహారాజులు, హైదరాబాద్ నిజాంలు కలిసి రైతుల సంక్షేమానికి తుంగభద్ర ఆనకట్టను నిర్మించినట్లే.. నేడు ప్రజాప్రతినిధులు కూడా రైతుల ప్రయోజనాల కోసం ఒకే వేదికపైకి రావాలి.
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నదుల అనుసంధానమే నీటి యుద్ధాలకు పరిష్కారం. జలాలను పొదుపుగా వాడుకుంటే సమస్యలే రావు. నీటి వివాదాలు రాకుండా రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి.
- ఏపీ సీఎం చంద్రబాబు
తుంగభద్ర పరివాహక ప్రాంతం ఈ ప్రాంత భవిష్యత్ గోదాం. దీనిని కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. సమస్యల పరిష్కారానికి మేమూ సిద్ధంగా ఉన్నాం.
- కర్ణాటక సీఎం డీకే శివకుమార్
బళ్లారి/అమరావతి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నదీ జల వివాద పరిష్కారం కోసం కేంద్రం నేతృత్వంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులతో ‘హైలెవల్ కమిటీ (ఉన్నత స్థాయి కమిటీ)’ వేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ప్రకటించారు. ఈ కమిటీ 100 రోజుల్లోగా జల వివాదాల పరిష్కార చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. దాదాపు 70 ఏళ్లుగా తుంగభద్ర నీటి కోసం వివాదాలు నెలకొన్న నేపథ్యంలో వాటిని పరిష్కరించడానికి జలశక్తి మంత్రి చొరవ చూపడం గమనార్హం. తుంగభద్ర డ్యాంకు ఏర్పాటు చేసిన కొత్త క్రస్ట్ గేట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, డీకే శివకుమార్‌లతో కలిసి పాటిల్ గురువారం ప్రారంభించారు. అనంతరం డ్యాం దిగువన కొప్పళ జిల్లా మునీరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఏపీ, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఆర్ పాటిల్ మాట్లాడుతూ, ఆర్డీఎస్ సహా తుంగభద్ర సమస్యలన్నింటికీ సీనియర్ అధికారుల కమిటీ కొన్ని ఆప్షన్లు ఇస్తుందని.. వాటిలో తమకు ప్రయోజనం చేకూర్చేవాటిని ఆయా రాష్ట్రాలు ఎంపిక చేసుకోవాలని సూచించారు.
ఆయన ప్రతిపాదనను ముగ్గురు ముఖ్యమంత్రులూ స్వాగతించారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక ఆనకట్టల్లో 15 శాతానికి పైగా పూడిక పేరుకుపోయిందని, దీంతో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని పాటిల్ చెప్పారు. సమస్య శాశ్వత పరిష్కారానికి పూడిక తొలగింపు (డీ సిల్టింగ్) కోసం కేంద్రం సొంత నిధులతో త్వరలో భారీ ప్రణాళిక అమలు చేయనుందని తెలిపారు. దీని అమలు బాధ్యతలను రాష్ట్రాలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. తుంగభద్ర జలాశయంలో కూడా 15 శాతానికి పైగా పూడిక పేరుకుపోయిందని.. విజయవంతంగా పూడిక తీస్తే నీటి నిల్వ సామర్ధ్యం 25 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మధ్య జలవివాదాలు ఉన్నప్పటికీ.. తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవానికి ముగ్గురు సీఎంలూ ఒకే వేదికపైకి వచ్చారని, సహకార భావంతో ముందుకు సాగడం చరిత్రాత్మక పరిణామమని పాటిల్ తెలిపారు. పరస్పర సహకారం, ఆర్థిక మద్దతుతోనే తుంగభద్ర జలాశయానికి అత్యవసరంగా 33 నూతన గేట్లను అమర్చడం సాధ్యమైందని గుర్తుచేశారు. ప్రధాని మోదీ నదుల అనుసంధాన ప్రాజెక్టుల ద్వారా దేశాన్ని ఏకతాటిపైకి తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నదీ జలాల విషయంలో ఉత్తరాది రాష్ట్రాలు సమన్వయంతో.. సామరస్యపూర్వకంగా వివాదాలకు తావులేకుండా పరిష్కరించుకుంటున్నాయని పాటిల్ వివరించారు. కేంద్రం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ నదీ జలాలను పారిస్తున్నాయని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు నేరుగా పైపుల ద్వారా పొలాల్లోకే నేరుగా సాగునీటిని తీసుకువెళ్తూ రెండు పంటలు పడిస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కూడా కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకుంటూ నదుల అనుసంధాన పథకాన్ని చేపట్టేందుకు ముందుకు రావాలని పాటిల్ సూచించారు. తమకు అన్ని రాష్ట్రాలూ సమానమేనని చెప్పారు.

నదుల అనుసంధానంతో భారత్ అన్‌స్టాపబుల్: చంద్రబాబు
నదుల అనుసంధానంతో దేశం అన్‌స్టాపబుల్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రైతుల కోసం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఐకమత్యంతో పనిచేస్తాయని, రైతులకు ఆండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. గంగ, కావేరి నదులను అనుసంధానం చేస్తే భారత్ మరింత శక్తివంతమైన దేశంగా అవతరిస్తుందని అన్నారు. ‘తుంగా పానం.. గంగా స్నానం’ అనే సామెత తుంగ నదీ జలాల విశిష్టతను తెలియజేస్తోందని చెప్పారు. ‘‘కెన్-బెత్వా లింకు ప్రాజెక్టు ద్వారా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాష్ట్రల్లో నదుల అనుసంధానం జరుగుతోంది. ఇదే తరహాలో గోదావరి-కావేరి అనుసంధానం చేపడితే ఏపీ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరతాయి. తీవ్రమైన తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న పొరుగు రాష్ట్రాలకు మంచినీటి ఇచ్చి ఆదుకోవడం ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్‌కు అలవాటు. 1983లో చెన్నె నగరానికి 15 టీఎంసీల తాగునీటిని అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎల్‌నివో ప్రభావం కారణంగా తుంగభద్ర, ఆలమట్టి జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో నీటి వినియోగంలో పొదుపు పాటించడం అత్యవసరం. రాష్ట్రాలుగా వేరైనా దేశంగా మనమంతా ఒక్కటే. రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి’ అని పిలుపిచ్చారు. బహిరంగ సభలో చంద్రబాబు ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

పంచాయితీలు కాదు పరిష్కారం కోరుకుంటున్నాం: రేవంత్
తుంగభద్ర జలాశయానికి నూతనంగా అమర్చిన 33 స్పిల్‌వే గేట్ల ప్రారంభంతో మూడు తరాలుగా కొనసాగుతున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు. బళ్లారి, అనంతపురం, కర్నూలు, పాలమూరు జిల్లాల రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి కొరత, వలసల సమస్యలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ ఆధునికీకరణ కార్యక్రమం లక్షలాది మంది రైతులకు ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు. విజయనగర సామ్రాజ్య స్థాపన, తుంగభద్ర ఆనకట్ట నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన రోజులకు ఎంతటి చరిత్రాత్మక ప్రాధాన్యం ఉందో.. ప్రస్తుత గేట్ల పునరుద్ధరణ, ఆధునికీకరణకు కూడా అంతే ప్రాధాన్యం ఉందని అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నాయకత్వంతో గేట్ల పునరుద్ధరణ పనులు విజయవంతంగా పూర్తికావడం అభినందనీయమని, ఈ కార్యక్రమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ పనితీరును ప్రశంసించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల తాగు, సాగునీటి సమస్యలకు ఆయన నాయకత్వంలో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు అందాల్సిన నీరు సముద్రంలో కలుస్తోందని.. తాగునీరు, సాగునీటి కోసం ప్రజలు జిల్లాలు, రాష్ర్టాలు దాటి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా మూడు రాష్ర్టాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయని, ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజుగా పేర్కొన్నారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్‌డీఎస్) కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీరు కేటాయించగా.. ప్రస్తుతం 5-6 టీఎంసీల నీరే రైతులకు అందుతోందని అన్నారు. తుంగభధ్ర జలాశయంలో పూడిక పేరుకుపోవడం, నీటి ప్రవాహానికి అడ్డంకులతో మిగిలిన నీరు వినియోగంలోకి రావడం లేదని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించి, రైతులకు పూర్తి న్యాయం చేయాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ జలాల పంపిణీకి సంబంధించి దశాబ్దాలుగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీఆర్ పాటిల్ మధ్యవర్తిగా వ్యవహరించి 3 రాష్ర్టాల మధ్య ఉన్న వివాదాలకు న్యాయబద్ధమైన పరిష్కారం చూపాలని కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. తాము నీటి పంచాయితీని కొనసాగించాలని కోరుకోవడంలేదని.. సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నామని రేవంత్ అన్నారు. ఆయన అభిప్రాయాన్ని జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ స్వాగతించారు.
33 టీఎంసీల నీటిని ఆదనంగా సంరక్షించుకోవచ్చు: డీకే
తుంగభద్ర పరివాహక ప్రాంత రైతుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఐక్యంగా ఉండాలని చరిత్రాత్మక నిర్ణయానికి వచ్చాయని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సభలో అన్నారు. రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని నవలి రిజర్వాయర్ నిర్మాణం, తుంగభద్ర జలాశయంలో పేరుకుపోయిన మట్టిని తొలగించడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలపై మూడు రాష్ట్రాల ప్రతినిధులు గంటల తరబడి చర్చించారని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. ‘జలవనరుల శాఖ చరిత్రలో ఈ రోజు ఒక మైలురాయి., మన నీరు-మన హక్కు అనే భావనతో మూడు రాష్ట్రాల రైతుల సంక్షేమాన్ని కాపాడే దిశగా ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కర్ణాటక నాయకత్వం కలిసి రైతుల ప్రయోజనాల కోసం ఒకే వేదికపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడం దేశ చరిత్రలో ఆరుదైన ఘట్టం. మూడు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తే తుంగభద్ర జలాశయంలో సుమారు 33 టీఎంసీల నీటిని ఆదనంగా సంరక్షించే అవకాశం ఉంటుంది’’ అని చెప్పారు. ‘బెంగళూరు సహజసిద్ధంగా అభివృద్ధి చెందిన నగరం. ఇక్కడి వాతావరణం, లాజిస్టిక్స్ నగరాభివృద్ధికి దోహదపడ్డాయి. కానీ హైదరాబాద్ పరిస్థితి అలా కాదు. ఆ నగరాన్ని చంద్రబాబు పట్టుదల, అనుభవం, దూరదృష్టితో ఐటీతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు’ అని సీఎం డీకే శివకుమార్ ప్రశంసించారు. హోస్పేట్‌లోని ఐఆర్బీ అతిథిగృహంలో శివకుమార్, రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌లతో చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శివకుమార్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాను, చంద్రబాబు ఇద్దరం యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిమేనని.. ఆయన పోరాటస్ఫూర్తి, పట్టుదల, దూరదృష్టి గురించి పలు సందర్భాల్లో తాను మాట్లాడుతుంటానని చెప్పారు.
బాబు వెంటబడి మరీ గేట్లు పెట్టించారు
తుంగభద్ర డ్యాంకు యుద్ధప్రాతిపదికన కొత్త క్రస్ట్‌గేట్లను అమర్చడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపారని, లేకుంటే ఈ క్రస్ట్ గేట్ల అమరిక మరో నాలుగైదేళ్లు ఆలస్యమయ్యేదని ఇంజనీరింగ్/గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు అన్నారు. చంద్రబాబు వెంట పడి మరీ క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేయించారని అన్నారు. తుంగభద్ర డ్యాంపై గురువారం ఆయన మాట్లాడారు. మరో 50 ఏళ్ల వరకూ డ్యాంకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తదని భరోసా ఇచ్చారు.
