మహిళల రాజ్యమిది
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:42 AM
కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా చేసేంత వరకు తమ ప్రభుత్వం విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మహిళలు ఏది కోరుకున్నా నెరవేర్చడానికి సోదరుడిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానని తెలిపారు....
ప్రభుత్వ సరఫరా వ్యవస్థలన్నీ ఆడబిడ్డల చేతికే!
కోటిమంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తాం
పంట మార్పిడిపై ఆడబిడ్డలే అవగాహన కల్పించాలి
మహిళలతో పెట్టుకున్నోడు అధికారంలో ఉండలేడు
మహిళకు ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే
మహిళకు తొలి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే
మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు
553 బస్సులు మహిళా సంఘాలకు అందజేత
హైదరాబాద్ సిటీ, జూన్ 9(ఆంధ్రజ్యోతి): కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా చేసేంత వరకు తమ ప్రభుత్వం విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మహిళలు ఏది కోరుకున్నా నెరవేర్చడానికి సోదరుడిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతీ లోక్‌సభ నియోజకవర్గానికి వస్తానని, మహిళలంతా తమకు అనువైన వ్యాపార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సరఫరా వ్యవస్థ మొత్తాన్ని మహిళలకు అప్పగిస్తామని ప్రకటించారు. వాటిల్లో పాగా వేసిన దళారులు, కమీషన్ ఏజెంట్లు, తెలంగాణ వ్యతిరేక శక్తులను ఏరివేస్తామని చెప్పారు. స్వయం సహాయక బృందాలకు 553 ఆర్టీసీ బస్సులు అప్పగింత సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం మహిళాశక్తి సభ నిర్వహించారు. మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. భారీ వర్షం మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, ఎవరెన్ని అడ్డు పుల్లలు వేసినా ఇప్పటి వరకు స్వశక్తి సంఘాలకు 61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ ఇచ్చామని చెప్పారు. మహిళల రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ పథకం అమల్లో భాగంగా రూ.2 వేల కోట్లు వడ్డీ కింద ప్రభుత్వం చెల్లించిందన్నారు. జీరో వడ్డీ రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు. వడ్ల కొనుగోలును మహిళా సంఘాలు విజయవంతం చేశాయని, ఇప్పుడు పంట మార్పిడిని ప్రోత్సహించే బాధ్యత కూడా మహిళలే తీసుకోవాలని పిలుపునిచ్చారు. కందులు, పప్పులు, మినుములు, ఇతర పప్పు ధాన్యాల పంటల అవసరంపై రైతు వేదికలు కేంద్రంగా రైతుల్ని చైతన్యపరచాలని కోరారు. అందుకు అవసరమైన నిధులను మహిళా సంఘాలకు ఇస్తామన్నారు. మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద ఇవ్వాల్సిన రూ.4 వేల కోట్లను గత ప్రభుత్వం పెండింగ్‌లో పెడితే మహిళలంతా కర్రుగాల్చి వాత పెట్టారని, దాంతో కేసీఆర్ అధికారం పోయి ఫామ్ హోస్‌లో పడుకున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

రాష్ట్ర మహిళలు పైసా చెల్లించాల్సిన పనిలేకుండా ప్రయాణం చేస్తుంటే కొంతమంది నేతలు విషం కక్కుతూ ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఉచిత బస్సులపై ధర్నా చేసే వాళ్లను అక్కలంతా జుట్టు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చిందని, రెచ్చగొట్టిన నాయులు తేలుకుట్టిన దొంగల మంచం కింద దాచుకున్నారని విమర్శించారు. భారత్‌కు స్వాతంత్య్రం రాగానే మహిళలకు ఓటు హక్కు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని చెప్పారు. రాష్ట్రపతిగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన న్యాయమూర్తిగా, పార్టీ అధ్యక్షుడులుగా మొదట మహిళకు అవకాశం కల్పించింది కాంగ్రెసేనని అన్నారు. కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలో ఒక్క మహిళనైనా అధ్యక్షురాలిగా నియమించారా? అని ప్రశ్నించారు. కనీసం ఆ ఆలోచన వచ్చిందా? అని అడిగారు. రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ అయిదేళ్లు క్యాబినెట్లో మహిళకు అవకాశం ఇవ్వలేదన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే కొండాసురేఖ, సీతక్కలను మంత్రులు చేశామని గుర్తు చేశారు. నేడు సర్పంచిగా, మున్సిపల్ చైర్మన్‌గా, మేయర్‌గా స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళలు రాణిస్తున్నారంటే రాజీవ్ గాంధీ రిజర్వేషన్ ఇవ్వడం వల్లే సాధ్యం అయ్యిందన్నారు. చట్టసభల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మహిళలు రాణించడానికి 2013 లోనే సోనియాగాంధీ రాజ్యసభలో బిల్లు ఆమోదింపజేశారని గుర్తు చేశారు. మహిళా పొదుపు సంఘాలు పీవీ నర్సింహారావు హయాంలో మొదలు అయ్యాయని, ఆ సంఘాలే ఎదుగుతూ రాష్ట్రంలో 67 లక్షల మంది మహిళలు వివిధ సంస్థల కింద ఎదుగుతున్నారన్నారు. సెర్ఫ్, మెప్మాలను కలిపి, కోటి మంది మహిళలతో వాటిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కోటి మందిమహిళలకు గత ఏడాది పాలపిట్ట చీరలు ఇచ్చామని, ఈసారి చిలకపచ్చ చీరలిస్తామని తెలిపారు. గతంలో బతుకమ్మ చీరలని ఇస్తే ఏనాడైనా కట్టుకున్నారా? అని ప్రశ్నించారు.

ఉచిత బస్సు వల్ల పాఠశాలల్లో ఆడపిల్లల డ్రాప్‌అవుట్స్ తగ్గాయని తెలిపారు. రాష్ట్రంలో 8 వేల మహిళా శక్తి భవనాలతో పాటు జిల్లా మహిళ శక్తి భవనాలను కార్పొరేట్ ఆఫీసులకు పోటీపడే విధంగా నిర్మించబోతున్నట్లు చెప్పారు. హైటెక్ సిటీ పక్కన రూ.వెయ్యి కోట్ల భూమిని మహిళా సంఘాలకు ఇచ్చామని, 106 స్టాల్స్ ద్వారా రాష్ట్రంలో మహిళల ఉత్పత్తులను ప్రపంచానికి ప్రదర్శిస్తున్నారని తెలిపారు. ఆస్తి ఏది ఉన్నా ఆడబిడ్డల పేరు మీద ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ‘‘పొదుపు సంఘాల్లో ఆడబిడ్డలతో పాటు సభ్యుడుగా వరుణదేవుడు చేరిండు. ఎల్ నినో ఉంది వానలు రావన్నారు. మంచి కార్యక్రమాన్ని పసుపు కుంకుమలతో ప్రారంభించి ఆడబిడ్డలు టెంకాయ కొట్టగానే, సీతక్క జెండా ఊపగానే బస్సుల కదలికతో పాటు కుంభవర్షం కురిసింది. వరుణ దేవుడి కటాక్షం లభించింది’’ అని సీఎం చమత్కరించారు. మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు ప్రభుత్వాన్ని నడిపిస్తామని, మూడు వేల బస్సులకు మహిళలను యజమానులను చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ‘‘మూడు వేల బస్సులను ఆర్టీసీలో పెట్టుకోవడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సమ్మతిస్తారా? ఆయన చప్పట్లు కొట్టడం లేదు’’ అని రవాణా మంత్రిని చూసి ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దాంతో వేదిక మీద ఉన్న పొన్నం లేని చప్పట్లు కొట్టారు. మండల, గ్రామ సమాఖ్యలు బస్సులను కొనుకుంటే ఆర్టీసీలో కిరాయికి పెట్టించే బాధ్యత తనదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘‘మీకు ఎవ్వరూ అడ్డం వచ్చినా ఆర్టీసీ బస్సుతో తొక్కుకుంటా పొండి, ఆడబిడ్డలతో పెట్టుకున్నోడు ఎవ్వడూ బాగుపడలేదు’’ అన్నారు.

మహిళా సంక్షేమానికి కృషి: పొన్నం
61 వేల కోట్లవడ్డీ లేని రుణాలిచ్చాం: సీతక్క
మహిళల అభివృద్ధి కోసం సీఎం తపన: మంత్రి కోమటిరెడ్డి
మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, ముఖ్యంగా ఆర్థికంగా ఉన్నతస్థితికి చేరుకోవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించినమహిళా వారోత్సవాలలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మహిళా సమాఖ్యల సహకారంతో మహిళలు ఆర్థిక పురోగతి సాధించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. మహిళలను బస్సుల ఓనర్లను చేశామని, 553 బస్సులను మహిళలకు అందించిన ఘనత రేవంతన్న నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన పేర్కొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రూ.61 వేల కోట్లు వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మహిళా సంఘాలలో 60లక్షల మంది ఉంటే 12 నుంచి 14లక్షల మంది చదువురాని వారేనని గుర్తించి, వారందరికీ చదువు చెప్పిస్తున్నారని తెలిపారు. మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి విశ్రాంతి లేకుండా రోజూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారని, మహిళలు, రైతుల మేలు కోసం నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు.
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఆ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు.