ఎల్‌నినో ఎఫెక్ట్: గిరిజన కుటుంబాలకు 125 రోజుల ఉపాధికి తెలంగాణ సర్కార్ చర్యలు
ABN , Publish Date - Oct 23 , 2026 | 08:18 PM
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఆదివాసీ, గిరిజన కుటుంబాలకు ఉపాధి కల్పించి వలసలను నివారించడంపై ప్రత్యేక దృష్టి సారించింది.
హైదరాబాద్, అక్టోబర్ 23: ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమైంది. ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. జాబ్ కార్డులు లేని అర్హులైన గిరిజన కుటుంబాలకు కొత్త కార్డులు మంజూరు చేయాలని ఆదేశించారు. అలాగే VB-G RAM G పథకం కింద అర్హులైన కుటుంబాలకు 125 రోజుల ఉపాధి కల్పించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
జాబ్ కార్డుల్లో 18 ఏళ్లు నిండిన కుటుంబ సభ్యులందరి పేర్లను నమోదు చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో అర్హులైన గిరిజన కుటుంబాలను గుర్తించి, జాబ్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. కరవు పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గకుండా చూడటంతో పాటు, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులను నివారించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఉపాధి కల్పన, జాబ్ కార్డుల జారీపై జిల్లాల వారీగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో పెట్టుబడులే కాదు.. ఉత్పత్తి కూడా ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వార్షిక పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలివే...
భవానీ భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
Read Latest AP News And Telangana News And National News