నెలాఖర్లో రైతు భరోసా
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:21 AM
వానాకాలం రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని 9 రోజుల్లోనే రైతులకు జమ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.
ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ.. అక్కడే నిధుల విడుదల ప్రారంభం
తర్వాత 9 రోజుల్లోనే అన్నదాతల ఖాతాలకు.. ఈసారి రైతువారీగానే జమ
67 లక్షల మంది రైతులు.. 1.38 కోట్ల ఎకరాలకు సాయం
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): వానాకాలం రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని 9 రోజుల్లోనే రైతులకు జమ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. జూన్ నెలాఖరులో ఖమ్మం జిల్లాలో రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించి.. రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేయించడాన్ని ఆ సభలోనే సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ మేరకు వ్యవసాయ శాఖ అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించింది. అయితే, యాసంగి రైతు భరోసా నిధులను జమ చేసిన ఎకరాల తరహాలో కాకుండా ఈసారి ఎప్పట్లానే రైతుల వారీగా పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు. అంటే, ఒక రైతుకు ఎంత విస్తీర్ణం ఉంటే అంతటికీ ఒకేసారి జమ చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ నిధుల సమీకరణపై దృష్టి సారించింది. ఇక, ఈనెల 18న జరగనున్న క్యాబినెట్‌లోనూ రైతు భరోసా నిధులపై చర్చించనున్నట్టు తెలిసింది. జూన్ నెలాఖరులో నిధుల జమ కార్యక్రమాన్ని మొదలు పెట్టి జూలై మొదటి వారంలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, 67.01 లక్షల మంది రైతులకు చెందిన 1.38 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందనుంది. 2025లో వానాకాలం రైతు భరోసా నిధులను జూన్ 16న ప్రారంభించి 22వ తేదీ వరకు అంటే 7 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ.8,284.66 కోట్లను జమ చేసింది. ఈ ఏడాది జూన్ 18 నుంచి 23 వరకు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆ నాలుగు రోజులపాటు కార్యక్రమాలను వాయిదా వేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో 23వ తేదీ తర్వాత చివరి వారంలో మంచిరోజు చూసుకుని రైతు భరోసా నిధుల విడుదల బహిరంగ సభను నిర్వహించనున్నారు.