హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు: సీఎం రేవంత్
ABN , Publish Date - Aug 22 , 2026 | 04:41 PM
తెలంగాణలో విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే దిశగా కీలక అడుగు పడింది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధులు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యావేత్తలతో సమావేశమై భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు..
హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణలో విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్ రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధులు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తలు, ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా విద్య, పరిశోధన రంగాల్లో పరస్పర సహకారం, అంతర్జాతీయ స్థాయి విద్యా కార్యక్రమాలను హైదరాబాద్‌లో నిర్వహించడం, సంయుక్త పరిశోధనలకు అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై చర్చ జరిగింది. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలను ప్రతినిధులు కేంబ్రిడ్జ్ బృందం దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో విద్యా కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంబ్రిడ్జ్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న మానవ వనరులు, సాంకేతిక సామర్థ్యాలు, పరిశ్రమలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థపై కూడా సమావేశంలో వివరించారు.
అదేవిధంగా సంయుక్త పరిశోధనా ప్రాజెక్టులు, ఇంక్యుబేషన్ కార్యక్రమాలు, స్టార్టప్‌ల అభివృద్ధి, యువ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం, అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయి. తెలంగాణ యువతలో ఉన్న ప్రతిభను ప్రపంచస్థాయి వేదికలకు తీసుకెళ్లేందుకు కేంబ్రిడ్జ్ సహకారం అందించడంపై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తెలంగాణలో విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు ఉన్న అవకాశాలపై కేంబ్రిడ్జ్ విద్యావేత్తలు సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, భాగస్వామ్యాన్ని ఆచరణలోకి తీసుకురావాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ భాగస్వామ్యం ద్వారా హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా, పరిశోధన, స్టార్టప్ హబ్‌గా అభివృద్ధి చేయడంతో పాటు తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
అన్నయ్యే ‘నా ఏకైక హీరో’.. చిరంజీవికి పవన్ బర్త్‌డే విషెస్
అనకాపల్లికి గోదావరి నీళ్లు.. సెప్టెంబర్ నాటికి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News