బియ్యం అక్రమాలపై సీఐడీ దాడులు.. 16 మంది మిల్లర్ల అరెస్ట్
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:36 PM
తెలంగాణలో ప్రభుత్వ ధాన్యం, బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై సీఐడీ కొరడా ఝళిపించింది. ప్రభుత్వానికి చెందాల్సిన వేల టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించడంతో పాటు సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం సరఫరా చేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు.
హైదరాబాద్, అక్టోబర్ 25: తెలంగాణలో ప్రభుత్వ ధాన్యం, బియ్యం నిల్వలకు సంబంధించి అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై సీఐడీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వానికి చెందాల్సిన ధాన్యాన్ని పక్కదారి పట్టించి, బియ్యం సరఫరాలో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు.
నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లోని మిల్లర్ల వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో పలువురు రైస్ మిల్లర్లను అదుపులోకి తీసుకోగా, మొత్తం 16 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి అప్పగించాల్సిన వేల టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించడంతో పాటు, లబ్ధిదారులకు సరఫరా చేయాల్సిన సన్న బియ్యం స్థానంలో దొడ్డు బియ్యం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్, ములుగు, మెదక్ జిల్లాల్లోని మిల్లర్లపైనా సీఐడీ కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
రైస్ మిల్లర్ల అక్రమాలపై పౌరసరఫరాల శాఖ అధికారులు విచారణ జరిపి సంబంధిత వివరాలను సీఐడీకి అందించినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వ ధాన్యం నిల్వలు, మిల్లింగ్ వివరాలు, బియ్యం సరఫరా రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. మిల్లర్ల అక్రమాల కారణంగా ప్రభుత్వానికి సుమారు రూ.96 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని ఇతర మార్గాల్లో విక్రయించారా? ధాన్యం నిల్వలు, సరఫరా లెక్కల్లో అవకతవకలు ఎలా జరిగాయి? ఈ వ్యవహారంలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రికవరీ చేసేందుకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, నష్టం అంచనా, నిందితులపై ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఐపీఎస్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి.. కోటికి పైగా కొల్లగొట్టి.. జల్సాలకు తగలెట్టి!
హుడా హైట్స్‌లో చ.గజం అప్‌సెట్ ధర 2 లక్షలు
Read Latest AP News And Telangana News