ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం...
ABN , Publish Date - Jan 26 , 2026 | 06:36 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సంతోశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లకూ నోటీసులిచ్చి విచారించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్, జనవరి26: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు స్పీడ్ అందుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సంతోశ్ రావుకు(Former MP Santosh Rao) సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు సిట్ నోటీసులు జారీచేసి.. విచారించిన సంగతి తెలిసిందే. వారిరువురూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సంతోశ్ రావుకు నోటీసులు పంపిన సిట్.. మంగళవారం(జనవరి 27) ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల సుప్రీం కోర్టు సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణపై దర్యాఫ్తు సంస్థను దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతించామని, ఇంకెంత కాలం విచారణ కొనసాగిస్తారని ప్రశ్నించింది. ఆయన విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు సిట్ అధికారులు.
ఇవి కూడా చదవండి...
ప్రజల విశ్వాసమే మా బలం.. వారి భద్రతకే తొలి ప్రాధాన్యం: సీపీ సజ్జనార్
నిజామాబాద్ ఘటన అత్యంత దురదృష్టకరం.. చట్టప్రకారం శిక్ష తప్పదు: మంత్రి దామోదర