రైతులు ఆరుతడి పంటలకే మొగ్గు చూపాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ABN , Publish Date - Jul 19 , 2026 | 02:59 PM
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరావు హెచ్చరించారు. రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని.. అధికారులు తాగు, సాగునీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
కరీంనగర్, జులై 19: తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఎల్‌నినో ప్రభావంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, దాని ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గే పరిస్థితులు ఏర్పడవచ్చని ఆయన తెలిపారు. కేవలం సాగునీటికే కాకుండా తాగునీటి అవసరాలు తీర్చడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుంటే సాగునీటిని యథేచ్ఛగా విడుదల చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రైతులు పరిస్థితులను ముందుగానే అర్థం చేసుకుని తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. నీటి లభ్యతను బట్టి పంటల ఎంపిక చేసుకుంటే నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని రైతులకు మంత్రి సూచించారు.
అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదేశించారు. వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా సహా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు తాగునీటి కొరత రాకుండా, రైతులకు అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికతో పనిచేస్తేనే ప్రజలు, రైతులు ఇబ్బందులు పడకుండా కాపాడగలమని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు.. నలుగురి మృతి, ఐదుగురి గల్లంతు..
ఫేక్ ఓఎమ్ఆర్ షీట్స్ వద్దు.. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎన్‌టీఏ అలర్ట్