Share News

మీసేవలో చరిత్రాత్మక రికార్డు.. ఒక్కరోజులో 2.20 లక్షల లావాదేవీలు: మంత్రి శ్రీధర్ బాబు

ABN , Publish Date - Aug 01 , 2026 | 05:46 PM

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మీసేవ సేవలు మరో కీలక మైలురాయిని చేరుకున్నాయి. ఒక్కరోజులో 2.20 లక్షల లావాదేవీలు నమోదై కొత్త రికార్డు సృష్టించగా.. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు.

మీసేవలో చరిత్రాత్మక రికార్డు.. ఒక్కరోజులో 2.20 లక్షల లావాదేవీలు: మంత్రి శ్రీధర్ బాబు
Telangana MeeSeva

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ పాలనకు ప్రతీకగా నిలిచిన మీసేవ సేవలు మరో అరుదైన ఘనతను సాధించాయి. గతంలో రోజుకు సగటున 70 నుంచి 80 వేల వరకు మాత్రమే నమోదయ్యే లావాదేవీలు, తాజాగా ఒక్కరోజులోనే 2.20 లక్షలకు చేరుకోవడం విశేషమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మీసేవ చరిత్రలో తొలిసారిగా రెండు లక్షల మార్క్‌ను అధిగమించడం రాష్ట్ర ఈ-గవర్నెన్స్ వ్యవస్థ బలోపేతానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ కార్డు దరఖాస్తులకు అత్యధిక స్పందన లభించగా, రవాణా శాఖ సేవలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర పౌర సేవల కోసం కూడా భారీ సంఖ్యలో ప్రజలు మీసేవను ఆశ్రయించినట్లు వెల్లడించారు. ప్రజలకు సులభంగా, వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడం వల్లే ఈ స్థాయి ఆదరణ లభించిందని మంత్రి అభిప్రాయపడ్డారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సాంకేతిక అంతరాయాలు లేకుండా లక్షలాది లావాదేవీలను విజయవంతంగా నిర్వహించిన మీసేవ బృందాలు, సాంకేతిక నిపుణులు, సంబంధిత శాఖల అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా భవిష్యత్తులో మరిన్ని పౌర సేవలను మీసేవ వేదిక ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. సాంకేతికతను మరింత సమర్థంగా వినియోగించి సేవల నాణ్యత, వేగం, పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి పౌరుడు ప్రభుత్వ సేవలను కార్యాలయాల చుట్టూ తిరగకుండా డిజిటల్ విధానంలో సులభంగా పొందేలా మీసేవను మరింత విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ డిజిటల్ గవర్నెన్స్‌లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

పెట్టుబడులకు అత్యంత సురక్షిత రాష్ట్రం తెలంగాణ: సీఎం రేవంత్‌రెడ్డి

ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

తెలంగాణలో ‘సర్’ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 07:53 PM