Share News

మీ బిడ్డల్ని అమెరికాకు పంపకండి.. అన్షుల్ కుంచ ఫ్యామిలీ విన్నపం

ABN , Publish Date - Jun 07 , 2026 | 11:42 AM

'మీ పిల్లల్ని అమెరికాకు పంపకండి' అంటూ అమెరికాలో దారుణ హత్యకు గురైన తెలంగాణ యువకుడు అన్షుల్ కుంచ కుటుంబసభ్యులు కోరుతున్నారు. తమ సోదరుడి హత్య ముమ్మాటికీ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అన్షుల్ సోదరి కన్నీటి పర్యంతమయ్యారు.

మీ బిడ్డల్ని అమెరికాకు పంపకండి.. అన్షుల్ కుంచ ఫ్యామిలీ విన్నపం
Indian Man Anshul Kuncha Shot Dead in Philadelphia During Alleged Fake Pizza Delivery Trap

మేడ్చల్/ గుండ్లపోచంపల్లి, జూన్ 7: 'మీ పిల్లల్ని అమెరికాకు పంపకండి' అంటూ అమెరికాలో దారుణ హత్యకు గురైన తెలంగాణ యువకుడు అన్షుల్ కుంచ కుటుంబసభ్యులు కోరుతున్నారు. తమ సోదరుడి హత్య ముమ్మాటికీ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అన్షుల్ సోదరి చెబుతున్నారు. ఫేక్ పిజ్జా ఆర్డర్‌‌తో ట్రాప్‌ చేసి పక్కా ప్లాన్ ప్రకారం అన్షుల్‌ని చంపేశారని అన్షుల్ సోదరి వాపోతున్నారు.

'ఈ దాడి జరిగిన సమయంలో అన్షుల్ వద్ద ఉన్న నగదు గానీ, ఇతర వస్తువులు గానీ దుండగులు దొంగిలించలేదు. దీంతో ఇది దోపిడీ కోసం జరిగిన హత్య కాదని, కావాలనే ప్రాణాలు తీయడానికి వేసిన ప్లాన్ అని స్పష్టమవుతోంది. ఘటన జరిగిన సమయంలో బ్యాగ్‌లు తగిలించుకున్న ఇద్దరు ముసుగు ధరించిన దుండగులు అక్కడ తిరగాడినట్టు కనిపిస్తోంది' అని అన్షుల్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

'అది కేవలం పక్కా స్కెచ్.. నా తమ్ముడిని చంపడానికే పిజ్జా ఆర్డర్‌తో ట్రాప్ చేశారు' అని అన్షుల్ సోదరి తన్వి వాపోయారు. ఈ ఘోర ఉదంతంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీరుమున్నీరయ్యారు. ఇదొక పక్కా ప్లాన్ అని ఆమె గుండెలవిసేలా రోదించారు. 'నా తమ్ముడిని ఎవరూ లేని ప్రాంతానికి పిజ్జా డెలివరీ ఇవ్వాలని పంపించారు. కానీ అది కేవలం ఒక ట్రాప్ అని మాకు తర్వాత తెలిసింది. అక్కడెవరూ లేరు.. అది కేవలం నా తమ్ముడిని చంపడానికి వేసిన డెత్ ట్రాప్. వాళ్లకు ఏం లాభం కలిగిందో, వాళ్ల ఉద్దేశం ఏంటో మాకు తెలియదు. నా తమ్ముడిని దారుణంగా పొట్టనబెట్టుకున్నారు.' అని తన్వి విలపించారు. గతంలో కూడా అన్షుల్‌పై అమెరికాలో ఒకసారి దాడి జరిగిందని, అప్పట్లో ఆయన గోల్డ్ చైన్, ఫోన్, నగదును దొంగలు లాక్కున్నారని.. కానీ ఎప్పుడూ ఇలాంటి ప్రాణాంతక దాడి జరగలేదని కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు.


'మీ పిల్లలను అమెరికా పంపకండి'

తీవ్ర భావోద్వేగానికి లోనైన తన్వి, తల్లిదండ్రులందరికీ ఒక కీలక విజ్ఞప్తి చేశారు. 'తమ పిల్లలను అమెరికా పంపాలనుకునే తల్లిదండ్రులందరికీ నేను ఒకటే చెబుతున్నాను. నా తమ్ముడు ఎంతో ప్రేమగల వ్యక్తి, ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. నిజానికి అతనికి అమెరికా వెళ్లాల్సిన అవసరమే లేదు, అతనికి వెళ్లడం ఇష్టం కూడా లేదు. కానీ మేమే బలవంతంగా పంపాము. ఇప్పుడు చూడండి ఏమైందో! దయచేసి మీ పిల్లలను అమెరికా పంపకండి' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఉండగా, ఉన్నతమైన భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులు, యువకులపై దాడులు రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ దారుణ ఘటన అమెరికాలోని తెలుగు కమ్యూనిటీతో పాటు తెలంగాణలోని ఆయన స్వగ్రామం గుండ్లపోచంపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది.


కాగా, అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియాలో తెలంగాణకు చెందిన 28 ఏళ్ల యువకుడు అన్షుల్ కుంచ (Anshul Kuncha) దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఒక బహుళజాతి కంపెనీ (MNC)లో ఉద్యోగం చేస్తూనే, అదనపు ఆదాయం కోసం వారాంతాల్లో (Weekends) పార్ట్ టైమ్ పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న అన్షుల్‌ను దుండగులు పక్కా వ్యూహంతో 'ఫేక్ పిజ్జా ఆర్డర్' ద్వారా ట్రాప్ చేసి కాల్చి చంపారు. శనివారం రాత్రి, ఒక అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌కు పిజ్జా డెలివరీ చేయాలంటూ ఆర్డర్ వచ్చింది. అతను డెలివరీ ఇచ్చి వెళ్తుండగా, దుండగులు అన్షుల్ తల మీద అతి సమీపం నుంచి కాల్పులు జరిపినట్టు సమాచారం. అన్షుల్ తలపై పలుమార్లు కాల్చి, అక్కడి నుండి పారిపోయారని తెలుస్తోంది. అన్షుల్‌కు ఏ నంబర్ నుంచి పిజ్జా ఆర్డర్ వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య

2047కి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని

దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు: కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 07 , 2026 | 12:06 PM