అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:13 AM
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. పిజ్జా డెలివరీ పర్సన్‌గా పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్న తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
అర్ధరాత్రి పిజ్జా డెలివరీకి వెళ్లగా కాల్చిచంపిన దుండగులు
మృతుడు గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ అన్షుల్
మేడ్చల్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. పిజ్జా డెలివరీ పర్సన్‌గా పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్న తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పిజ్జా డెలివరీ చేసి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని కాల్చిచంపారు. దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో బుల్లెట్ తలలోకి దూసుకుపోయింది. ఈ దారుణం పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా నగరంలో శుక్రవారం అర్ధరాత్రి (అక్కడి కాలమానం పక్రారం) చోటుచేసుకుంది. మృతుడు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ శ్రీనివాస్ గౌడ్ కుమారుడు అన్షుల్ (28). అతను మూడున్నర సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వారాంతంలో పార్ట్ టైమ్ జాబ్‌గా పిజ్జా డెలివరీ పనిచేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి నార్త్ ఫిలడెల్ఫియా ప్రాంతం ఎడ్జీ స్ట్రీట్‌లోని రేమండ్ రోసెన్ హోమ్స్ కాంప్లెక్స్ నుంచి మూడు పిజ్జాలు ఆర్డర్ రావడంతో అన్షుల్ వెళ్లాడు. ఆర్డర్ వచ్చిన ఫ్లాట్ ముందు పిజ్జాలు ఉంచి, తిరిగి వస్తుండగా ఆ కాంప్లెక్స్ సమీప వీధిలో దుండగులు అన్షుల్‌పై కాల్పులు జరిపారు. ఖాళీగా ఉన్న ఫ్లాట్‌కు ఎవరో పిజ్జా ఆర్డర్ ఇచ్చారని గుర్తించినట్లు ఫిలడెల్ఫియా పోలీసులు తెలిపారు. హంతకులను గుర్తించేందుకు, హత్యకు కారణాలను తెలుసుకునేందుకు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. అన్షుల్‌ను ఇద్దరు వ్యక్తులు అనుసరించినట్లు సీసీటీవీ కెమెరా ఫుటేజీలో గుర్తించారు. ఎన్నో ఆశలతో ఉన్నత చదువులకు వెళ్లిన అన్షుల్ హత్యకు గురయ్యాడని తెలిసి అతని కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. గుండ్లపోచంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన అన్న మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని అన్షుల్ సోదరి తన్వి కోరారు.