కేసీఆర్, హరీశ్‌లపై చర్యలు వద్దు!
ABN , Publish Date - Apr 23 , 2026 | 05:00 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అవకతవకలు, నిర్మాణపరంగా తలెత్తిన లోపాలు, అందుకు బాధ్యులను నిగ్గు తేల్చటానికి ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా..
ఎస్‌కే జోషి, స్మితాసభర్వాల్‌ల మీద కూడా.. కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పు
జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా వీరిపై తదుపరి చర్యలొద్దంటూ సర్కార్‌కు ఆదేశాలు
విచారణ సందర్భంగా వాదనలు వినిపించే సంపూర్ణ అవకాశం పిటిషనర్లకు కల్పించాలి
వారికి అవసరమైన దస్త్రాలు, పత్రాలు ఇవ్వాలి
‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం, 1952’లోని సెక్షన్ 8 బీ దీనిని స్పష్టం చేస్తోంది
ఈ నిబంధనను కమిషన్ పాటించలేదు
కేసీఆర్, హరీశ్‌లకు పత్రాలను అందించినా కూడా తగు వ్యవధి ఇవ్వలేదు
హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు
కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని స్పష్టీకరణ
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అవకతవకలు, నిర్మాణపరంగా తలెత్తిన లోపాలు, అందుకు బాధ్యులను నిగ్గు తేల్చటానికి ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. కేసీఆర్, హరీశ్‌రావు తదితరులపై తదుపరి చర్యలకు ఉపక్రమించరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కమిషన్ విచారణ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందని, తమ వాదనలు వినలేదని, కాబట్టి కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకుండా కట్టడి చేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, సీఎంవో మాజీ కార్యదర్శి స్మితా సభర్వాల్ హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 6ను రద్దు చేయాలని కోరారు. వీటిపై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం, 1952’లోని సెక్షన్ 3 ప్రకారం 2024 మార్చి 14వ తేదీన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఏకపక్షమో, చట్టవిరుద్ధమో కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, పిటిషనర్లకు తమ వాదనలు వినిపించటానికి తగిన అవకాశం ఇవ్వటంలో కమిషన్ విఫలమైందని, కాబట్టి, పిటిషనర్ల మీద కమిషన్ రికార్డు చేసిన ఆరోపణలు అమలులో ఉండబోవని తెలిపింది. ఆ నివేదిక ఆధారంగా పిటిషనర్ల మీద చట్టప్రకారం చర్యలు తీసుకోవటానికి వీల్లేదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తీర్పులో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘పిటిషనర్లకు వ్యతిరేకంగా విచారణలో కమిషన్ సేకరించిన ఆధారాలను ‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం, 1952’ చట్టం సెక్షన్ 8 బీ ప్రకారం పిటిషనర్లకు అందజేయటమేగాక ఆ ఆరోపణలపై స్పందించటానికి వారికి తగిన సమయం ఇవ్వాలి. కానీ, ఆ అవకాశం వారికి ఇవ్వలేదు.
అంతేకాదు వారి ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్న ప్రతికూల అంశాలను కమిషన్ రికార్డు చేసింది. వాటి మీద స్పందించటానికి కూడా వారికి అవకాశం ఇవ్వలేదు. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం’ అని ధర్మాసనం పేర్కొంది. స్మితాసభర్వాల్ తన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారని, కాబట్టి, ఆమె మీద చర్యలు తీసుకోవచ్చని కమిషన్ పేర్కొందని గుర్తు చేసింది. మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించటానికి వీలుగా.. నిపుణుల కమిటీ నివేదికను ఎస్‌కే జోషి కావాలని తొక్కిపెట్టారని, ఆయన మీద కూడా చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ తన నివేదికలో తెలిపిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ రకమైన వ్యాఖ్యలు ఆయా పిటిషనర్ల ప్రతిష్ఠకు భంగం కలిగిస్తాయని, వాటి మీద వారికి స్పందించటానికి తగిన సమయం ఇవ్వాల్సిందని అభిప్రాయపడింది.
వ్యక్తిగత ప్రతిష్ఠ.. జీవించే హక్కుతో సమానం
‘వ్యక్తిగత ప్రతిష్ఠ జీవించే హక్కుతో సమానం అంటూ కిరణ్‌బేడీ-ఎల్‌కే అద్వానీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంత కీలకమైన ఈ అంశంలో కాళేశ్వరం కమిషన్.. 1952 చట్టంలోని సెక్షన్ 8బీ ప్రకారం పిటిషనర్లకు నోటీసులు ఇచ్చి వారు స్పందించటానికి తగిన సమయం, ఆధారాలు ఇవ్వాలి. కానీ, అలా వ్యవహరించటంలో విఫలమైంది’ అని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. కేసీఆర్, హరీశ్‌రావులకు కమిషన్ సమన్లు జారీ చేసిన తర్వాత.. వారు తమ మీద ఉన్న ఆరోపణలకు సంబంధించిన పత్రాలను అందజేయాలని కోరారని, కమిషన్ వాటిని అందించినప్పటికీ.. చాలా తక్కువ సమయం ఇచ్చిందని ధర్మాసనం గుర్తు చేసింది. ‘సమన్ల జారీ నేపథ్యంలో కేసీఆర్, హరీశ్ తమకు కొన్ని పత్రాలు అందజేయాలని 2025 జూన్ 6న కమిషన్‌ను కోరారు. వారికి అదే నెల 9న ఆ పత్రాలను అందించారు. హరీశ్‌ను 9న విచారణకు రావాలని అంతకుముందు కమిషన్ సమన్లు జారీ చేసింది. అంటే ఆయనను విచారణకు పిలిచిన రోజే పత్రాలను అందించారు. కేసీఆర్‌ను 11న విచారించారు. ఆయా పత్రాలను పరిశీలించి తమ వాదనలు రూపొందించుకోవటానికి తగు సమయం పిటిషనర్లకు ఇవ్వటంలో కమిషన్ విఫలమైంది’ అని ధర్మాసనం ఆక్షేపించింది. వారికి కమిషన్ అందించిన పత్రాలు, ఆధారాలు అనేక పేజీలతో కూడినవని, వాటిని అంత తక్కువ సమయంలో పరిశీలించటం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం చేసిన వాదనలు సహేతుకంగా లేవని తెలిపింది. కాబట్టే, కమిషన్ నివేదిక ఆధారంగా పిటిషనర్ల మీద చర్యలు తీసుకోవటానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం, 1952’లోని సెక్షన్ 3 ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఏకపక్షమో, చట్టవిరుద్ధమో కాదని తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది.
ఇదీ నేపథ్యం
కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం జరిగింది. 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీలో 12 పిల్లర్లు కలిగిన ఏడో బ్లాకు కుంగింది. ఆ తర్వాత కొద్దిరోజులకే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో భారీగా సీపేజీలు బయటపడ్డాయి. 2023 డిసెంబరు 7వ తేదీన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడింది. 2024 మార్చి 14వ తేదీన జీవోనెం.6 ద్వారా జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో.. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో తలెత్తిన సమస్యలపై విచారణకు కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో సహా 115 మందిని విచారించి ప్రభుత్వానికి కమిషన్ నివేదిక అందించింది. బ్యారేజీల కుంగుబాటుకు, రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం కలగడానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నిర్ణయాలే కారణమని కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. ఒంటెద్దు పోకడతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారని, బ్యారేజీలు ఎక్కడ కట్టాలనే నిర్ణయంలో తీవ్ర తప్పిదాలు జరిగాయని తెలిపింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, మంత్రివర్గం ఉపసంఘం, హైపవర్ కమిటీ.. ఏదీ కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల దగ్గర బ్యారేజీలు కట్టాలని సిఫార్సు చేయలేదని పేర్కొంది. కేసీఆర్‌పై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కమిషన్ సిఫార్సు చేసింది. ఈ నివేదికను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. అనంతరం, ఈ కేసులో పలు ఏజెన్సీల పాత్ర ఉండటంతో దీనిపై సీబీఐ విచారణ కోరుతూ శాసనసభ తీర్మానం చేసింది.