Share News

పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై జూన్‌ నాటికి నిర్ణయం

ABN , Publish Date - May 03 , 2026 | 05:41 AM

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఫిట్‌మెంట్‌పై జూన్‌ నాటికి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై జూన్‌ నాటికి నిర్ణయం

  • తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారుల కమిటీకి ఆదేశం.. 1లోగా ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అందజేస్తాం

  • రిటైర్డ్‌ ఉద్యోగులకు వంద రోజుల్లో 6వేల కోట్లు ఇస్తాం.. 5న తలపెట్టిన దీక్షను ఉపసంహరించుకోండి

  • ఉద్యోగ సంఘాల నేతలతో భేటీలో రేవంత్‌.. దీక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు నేతల ప్రకటన

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఫిట్‌మెంట్‌పై జూన్‌ నాటికి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తక్షణమే పీఆర్సీ నివేదిక అందించాలని అధికారుల కమిటీని ఆదేశించారు. శనివారం తన నివాసంలో ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను చాలా వరకు పరిష్కరించామన్నారు. ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. పీఆర్సీ సహా నాలుగు అంశాలపై స్పష్టత ఇచ్చిన సీఎం.. ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కార్డులను జూన్‌ 1లోగా అందజేస్తామన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి రూ.6 వేల కోట్లను వంద రోజుల్లో చెల్లిస్తామన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల బిల్లులు పేరుకుపోయాయని, దీనిపై కసరత్తు చేసి సమస్యల పరిష్కారంలో ముందుకుపోతున్నామని తెలిపారు. ఉద్యోగులు ఈ నెల 5న నిర్వహించ తలపెట్టిన సామూహిక నిరాహార దీక్షలతోపాటు అన్ని రకాల నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకోవాలని కోరారు. దీంతో ఆ కార్యక్రమాలన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకుని పని చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే తొలి నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని, స్వేచ్ఛగా ఉద్యోగ సంఘాల ఎన్నికల నిర్వహణకు అవకాశం కల్పించామని చెప్పారు. ఎంతో కాలం పెండింగ్‌లోఉన్న ఉపాధ్యాయుల బదిలీలను ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేస్తున్నామని తెలిపారు. రెండేళ్లలో 67,760 ఉద్యోగ నియామకాలు చేశామన్నారు. ప్రతి రెండు నెలలకోసారి గుర్తింపు సంఘాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై.. సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. సీఎస్‌ వద్ద సమస్యలు పరిష్కారం కాకపోతే డిప్యూటీ సీఎం వద్ద పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో సీఎం నేతృత్వంలో చాలా వరకు ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతున్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.


ఓడీలను రద్దు చేయాలి..

వైద్య విధాన పరిషత్‌లో 13,100 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. కాగా, 317 జీవోలో స్థానికతకు విరుద్ధంగా మల్టీజోన్‌ మారిన వారిని స్థానికత ఆధారంగా బదిలీ చేయాలని హైదరాబాద్‌కు చెందిన నీటిపారుదల శాఖ ఇంజనీర్ల సంఘం కోరింది. ఓడీలను రద్దు చేసి.. అందరినీ సాధారణ బదిలీల పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. ఉద్యోగులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితే.. బకాయిలన్నింటినీ వచ్చే ఏడాది లోపు క్లియర్‌ చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు మారం జగదీశ్వర్‌, వి.లచ్చిరెడ్డి, ఏలూరి శ్రీనివాసరావు, చావా రవి, బి.శ్యామ్‌, జి.శ్రీనివాస్‌ రెడ్డి, దామోదర్‌ రెడ్డి, జి.సదానందం గౌడ్‌, వి.రవీందర్‌ రెడ్డి, వి.రాజశేఖర్‌, సి.మహేందర్‌, ఆర్‌. రవీందర్‌, చక్రధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2026 | 07:00 AM