ప్రతి పౌరుడికీ సమగ్ర సంక్షేమ కార్డు
ABN , Publish Date - May 29 , 2026 | 03:55 AM
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా చూడడంతో పాటు ఇప్పటికే అందుతున్న పథకాల్లో అనర్హులుంటే.. వారిని తప్పించేందుకు సర్కారు సన్నద్ధమైంది. సంక్షేమ పథకాల అమలులో పూర్తి పారదర్శకత ఉండేలా పటిష్ఠ .....
ఆధార్ తరహాలో విశిష్ట గుర్తింపు సంఖ్య
ప్రభుత్వ పథకాల సమగ్ర వివరాలుండాలి
సమగ్ర సర్వే, హెల్త్ ప్రొఫైల్ కూడా ఈయూనిఫైడ్ కార్డుకు అనుసంధానించాలి
మరణ ధ్రువీకరణ పత్రం జారీ కాగానే ఆ సమాచారం ‘చేయూత’ డేటాబేస్‌కు చేరాలి
సంక్షేమ ఫలాలు అర్హులకే అందేలా చూడాలి
ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా చూడడంతో పాటు ఇప్పటికే అందుతున్న పథకాల్లో అనర్హులుంటే.. వారిని తప్పించేందుకు సర్కారు సన్నద్ధమైంది. సంక్షేమ పథకాల అమలులో పూర్తి పారదర్శకత ఉండేలా పటిష్ఠ చర్యలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ సమగ్ర సంక్షేమ కార్డు (యూనిఫైడ్ కార్డు)ను ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే అంశంపై తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ యూనిఫైడ్ కార్డు ఉండాలని, అందులో వారికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఉండాలని ఆదేశించారు. అవసరమైతే ఆధార్ నంబర్ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ఇచ్చేలా ఆలోచించాలన్నారు. ఏ శాఖ ద్వారా ఎవరికి, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతుందనే వివరాలు ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలియాలని సూచించారు. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ విషయాన్ని ప్రత్యేకంగా చర్చించారు. సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని సీఎం అన్నారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు. నిజమైన అర్హులకు పథకాలు మరింత కచ్చితంగా అందుతాయని, అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. యూనిఫైడ్ కార్డు ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఉండాలన్నారు. టెక్నాలజీపై పట్టు ఉండి, చురుగ్గా పనిచేసే అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని చెప్పారు.
ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్మిక శాఖ, విద్యా శాఖ, ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వ బీమా పథకాల వివరాలు ఉండాలని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే వివరాలను కూడా ఈ కార్డుకు అనుసంధానించాలని సూచించారు. లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను సీఎం రేవంత్ ఆదేశించారు. ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ఉండాలన్నారు. ఎక్కడైనా మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయితే, ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్‌కు చేరాలని, వెంటనే దాని ఆధారంగా చర్యలు మొదలయ్యేలా ఉండాలని చెప్పారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా సమగ్ర సంక్షేమ కార్డుతో అనుసంధానం చేయాలన్నారు. అలాగే కేరళ నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లే ఉద్యోగుల కోసం ఆ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణతో పాటు పాస్‌పోర్టులు, వీసాల సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచితే, అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలు కచ్చితంగా చేరేలా, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

జూన్ 2 నుంచి మహాలక్ష్మి స్మార్ట్ కార్డు
క్యూఆర్ కోడ్.. ఫొటో వివరాలతో.. ఆర్టీసీ, మీసేవా కేంద్రాల్లో జారీ
రాష్ట్రప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుంది. ఇప్పటి వరకు బస్సుల్లో ఆధార్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీనికి బదులుగా జూన్ 2 నుంచి ‘మహాలక్ష్మి స్మార్ట్ కార్డు’ను అందుబాటులోకి తేనుంది. పైలట్ ప్రాజెక్టుగా మొదట ప్రతి జిల్లా నుంచి ఓ మండలాన్ని ఎంపిక చేసి వీటి జారీ ప్రక్రియ చేపట్టనున్నారు. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అందజేస్తారు. స్మార్ట్ కార్డు వాడుకలోకి తెస్తూనే.. అదే సమయంలో అవి ఇంకా అందని వారికి ఆధార్ కార్డుతో ఉచిత ప్రయాణం కొనసాగిస్తారు. బ్యాంకు ఏటీఎం కార్డు తరహాలో మహాలక్ష్మి కార్డును రూపొందించనున్నారు. ఆధార్ కార్డులోని సమాచారం, మహిళ ఫొటో వివరాలతో ప్రత్యేక క్యూఆర్ కోడ్‌తో దీన్ని రూపొందించనున్నట్లు సమాచారం. ఆర్టీసీ బస్‌పాస్ కేంద్రాలు, మీ-సేవా కేంద్రాల నుంచి దీన్ని పొందవచ్చు. ఇందుకు రూ. 50 చెల్లించాల్సి ఉంటుందని ప్రాథమిక సమాచారం. తెలంగాణ ప్రాంత చివరి మహిళా ప్రయాణికురాలు సైతం తీసుకునే వరకు ఈ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుంది. ఆధార్, ఇతర గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లి దీన్ని పొందవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబరు 9 నుంచి మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. గత మార్చి చివరినాటికి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు 290 కోట్ల జీరో టిక్కెట్లు జారీ చేసారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు రూ.10 వేల కోట్ల విలువైన ఉచిత బస్సు ప్రయాణం చేసారు. కాగా స్మార్ట్‌కార్డులకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి నమూనా రూపొందించలేదని అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా ఓ నమూనా ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.