టిమ్స్‌ల్లో పూర్తిస్థాయి సేవలు జూన్ 2 కల్లా..
ABN , Publish Date - Nov 13 , 2026 | 02:08 AM
వచ్చే జూన్ 2 నాటికి అల్వాల్, ఎల్బీనగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, నిమ్స్ విస్తరణ పనులు పూర్తి కావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు
మూడు టిమ్స్‌లకు ఏకీకృత నియామకాలు
అవసరాలను బట్టి ఆస్పత్రుల మధ్య బదిలీలు
నిమ్స్, టిమ్స్ మధ్య సమన్వయం ఉండాలి
వైద్య సిబ్బంది నియామక ప్రక్రియ వేగవంతం
2027 చివరికి ఉస్మానియా కొత్త భవనం
వైద్యులు, సిబ్బంది హాజరుకు బయోమెట్రిక్ అమలు తప్పనిసరి
వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో సీఎం రేవంత్
హైదరాబాద్, నవంబరు 12, (ఆంధ్రజ్యోతి): వచ్చే జూన్ 2 నాటికి అల్వాల్, ఎల్బీనగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, నిమ్స్ విస్తరణ పనులు పూర్తి కావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ఉస్మానియా నూతన ఆస్పత్రి భవనం పనులు పూర్తి చేసి రోగులకు వైద్య సేవల కోసం అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. వైద్య, ఆరోగ్య శాఖపై గురువారం సీఎం సమీక్షనిర్వహించారు. టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా నూతన ఆస్పత్రి భవనం నిర్మాణ పనులు, ఆయా ఆస్పత్రులకు అవసరమైన పరికరాల కొనుగోలు, వైద్యులు, సిబ్బంది నియామకాలు ఏకకాలంలో పూర్తి కావాలని ఆదేశించారు. నియామకాలకు సంబంధించి ఏకీకృత విధానం పాటించాలని, అవసరాలను బట్టి మూడు టిమ్స్ మధ్య వైద్యులు, సిబ్బంది బదిలీలు జరిగేలా వ్యవస్థ ఉండాలన్నారు. ఆస్పత్రుల నిర్వహణ, హౌస్ కీపింగ్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో చేపట్టాలని సూచించారు. టిమ్స్‌ల పర్యవేక్షణకు గ్రూప్-1 అధికారులను, హౌస్ కీపింగ్ సిబ్బంది పనితీరును పర్యవేక్షించేందుకు విశ్రాంత సైనికాధికారులను నియమిస్తామని తెలిపారు. టిమ్స్‌తో పాటు బోధన, నర్సింగ్ కాలేజీల పనులు, పరికరాల కొనుగోలు ప్రక్రియ ఏకకాలంలో పూర్తవ్వాలని ఆదేశించారు.
నిమ్స్‌లో శస్త్రచికిత్సలకు ఎక్కువ సమయం పడుతోందని, ఆ కారణంగా సనత్‌నగర్ టిమ్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. నిమ్స్‌లో పడకలు లేకపోయినా, శస్త్రచికిత్సలు ఆలస్యమైనా సనత్‌నగర్ టిమ్స్‌ను వినియోగించుకోవాలని సూచించారు. టిమ్స్‌లో వైద్యుల నియామకం పూర్తయ్యే దాకా బయటి నుంచి వైద్యులను నియమించుకోవాలన్నారు. వైద్యులు, సిబ్బంది నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామని, నిర్మాణంలో ఉన్న 79 డయాలసిస్ సెంటర్ల పనులు త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు విషయంలో బయోమెట్రిక్ విధానం అమలయ్యేలా చూడాలన్నారు. మూడేళ్లలోనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను 30 వేల నుంచి 38 వేలకు పెంచిన విషయాన్ని సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ఈ మూడేళ్లలో ప్రభుత్వాస్పత్రుల్లో ఔట్ పేషంట్ల సంఖ్య 7 కోట్ల నుంచి 9 కోట్లకు పెరిగిందని, ఇన్ పేషంట్ల సంఖ్య 23 లక్షల నుంచి 24.3 లక్షలకు పెరిగిందని సీఎంకు అధికారులు వివరించారు. మునుపు రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి సగటున 3.9 శాతం కేటాయించగా, గత మూడేళ్లుగా సగటున 4.8 శాతం నిధులు కేటాయిస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. మూడేళ్లలోనే వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, పారా మెడికల్ పోస్టులు ఇలా మొత్తంగా 13,401 నియామకాలు పూర్తి చేశామని సీఎం తెలిపారు. మరో 5,640 నియామకాల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర, వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ, టీజీఎంఎ్‌సఐడీసీ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ ముష్రఫ్ అలీ ఫరూఖీ, నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్, టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేందర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మూడు టిమ్స్‌కు ఒకే రిక్రూట్‌మెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు