తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు ఈనెల 13 వరకు వేసవి సెలవుల పొడిగింపు!
ABN , Publish Date - Jun 04 , 2026 | 09:24 PM
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా మండుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు భారీ ఊరటనిచ్చింది.
హైదరాబాద్, జూన్ 04 : రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా మండుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు భారీ ఊరటనిచ్చింది. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాలకు ఈనెల (జూన్) 13వ తేదీ వరకు వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ సెలవులను పొడిగించారు. చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి ఆదేశాల తూచా తప్పకుండా పాటిస్తూ, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓఝా సెలవుల పొడిగింపునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు మే 1వ తేదీ నుంచే వేసవి సెలవులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జూన్ మొదటి వారంలోనే ఇవి తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే భానుడి భగభగలు తగ్గకపోవడంతో, సెలవులను ఈనెల 13 వరకు పొడిగించారు. 14వ తేదీ ఆదివారం కావడంతో, ఈ నెల 15వ తేదీన (సోమవారం) అంగన్వాడీ కేంద్రాలు తిరిగి యథాతథంగా తెరుచుకోనున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా చిన్నారులు, తల్లులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు వర్తిస్తాయని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇండియా కూటమి భేటీకి నై.. డీఎంకే సంచలన నిర్ణయం
అగ్నిప్రమాదం.. భవనం నుంచి బాధితులు దూకుతుంటే.. కింద పరుపులను పేర్చి..