Share News

అగ్నిప్రమాదం.. భవనం నుంచి బాధితులు దూకుతుంటే.. కింద పరుపులను పేర్చి..

ABN , Publish Date - Jun 04 , 2026 | 05:47 PM

బుధవారం ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో భవనంలో చిక్కుకున్న బాధితులు కిందకు దూకేందుకు వీలుగా నేలపై పరుపులను పేర్చి వారి ప్రాణాలను కాపాడిన తండ్రీకొడుకులపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది.

అగ్నిప్రమాదం.. భవనం నుంచి బాధితులు దూకుతుంటే.. కింద పరుపులను పేర్చి..
Delhi Fire Accident

ఇంటర్నెట్ డెస్క్: దేశరాజధాని ఢిల్లీలోని ఒక లాడ్జ్‌లో బుధవారం (జూన్ 3) ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 21 మంది మృత్యువాతపడ్డారు. అయితే, స్థానికంగా షాపు నిర్వహిస్తున్న తండ్రీకొడుకులు భవనంలో చిక్కుకున్న అనేక మంది ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం వారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

బుధవారం ఉదయం భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అనేక మంది చిక్కుకుపోయారు. వారు కిందకు వచ్చేందుకు ఏ అవకాశమూ లేకపోయింది. దీంతో కొందరు భవనం నుంచి కిందకు దూకేందుకు సిద్ధమయ్యారు. కిందకు దూకితే ఏం కాదుగా అంటూ అక్కడున్న వారిని ఆందోళనతో ప్రశ్నించారు. ఈ క్రమంలో రియాజుద్దీన్, ఆయన కుమారుడు అర్మాన్ రంగంలోకి దిగారు. క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా భవనానికి సమీపంలో నేలపై కొత్త పరుపులను పరిచారు. దీంతో, బాధితులు వాటిపైకి సురక్షితంగా దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.


‘ఉదయం నేను షాపు వద్దకు వచ్చేసరికే అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కూడా మంటలు వ్యాపించాయి. లోపలికి వేళ్లేందుకు, బయటకు వచ్చేందుకు అసలు ఏ దారీ లేకుండా పోయింది. మమ్మల్ని కిందకు దూకేయమంటారా అంటూ పైఅంస్తుల్లోని వారు భయంతో ప్రశ్నించారు. దీంతో, వెంటనే నేను మా షాపులోంచి 20 నుంచి 25 వరకూ పరుపులు, క్విల్ట్స్‌ను తీసుకొచ్చి భవనం బయట పరిచాను’ అని అర్మాన్ అన్నారు.

‘ఈ క్రమంలో మాకు రూ.2 లక్షల వరకూ నష్టం వచ్చింది. బాధితులకు దుప్పట్లు కూడా ఇచ్చాము. మృతులను బయటకు తెచ్చేందుకు కూడా దుప్పట్లను ఇచ్చాము. మా వద్ద ఉన్నవన్నీ ఇచ్చేశాము. మానవత్వపు కోణంలో చూస్తే ఎవరైనా ఒకటే. హిందువైనా, ముస్లింలైనా మనందరం భారతీయులమే. కాబట్టి, కష్టాల్లో ఉన్న సోదరులకు స్నేహం చేయడం మా బాధ్యత’ అని అర్మాన్ తండ్రి రియాజుద్దీన్ అన్నారు. దీంతో, ఈ తండ్రీకొడుకులపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

ఆ వీడియోతో వివాదం.. జూన్ 6 నిరసనపై పెరిగిన ఉత్కంఠ!

త్వరలో దీదీకి మరో షాక్? 20 మంది ఎంపీలు..

Updated Date - Jun 04 , 2026 | 06:52 PM