Share News

త్వరలో దీదీకి మరో షాక్? 20 మంది ఎంపీలు..

ABN , Publish Date - Jun 04 , 2026 | 03:24 PM

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కూడా తిరుగుబాటు బావుటా ఎగరేసే యోచనలో ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

త్వరలో దీదీకి మరో షాక్? 20 మంది ఎంపీలు..
Mamata Banerjee

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో ఇటీవల కనిపించిన దృశ్యాలు పార్లమెంటులో కూడా పునరావృతం కానున్నాయా? టీఎంసీ ఎంపీలు కూడా తిరుగుబాటు బావుటా ఎగరవేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీఎంసీకి చెందిన సుమారు 20 మంది ఎంపీలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికే ఈ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఉన్నతస్థాయిలో చర్చలు కూడా జరుగుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


తృణమూల్‌కు లోక్‌సభలో 28 మంది ఎంపీలు, రాజ్యసభలో 13 మంది ఎంపీలు ఉన్నారు. పార్లమెంటులో ఎంపీల సంఖ్యాపరంగా టీఎంసీ రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు వేదికగా టీఎంసీ చీలిపోతే పార్లమెంటులో ప్రతిపక్షం ప్రభావం గణీయంగా తగ్గుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో కనిపించిన సీన్ రాబోయే కొన్ని రోజుల్లో పార్లమెంటులో కూడా కనిపిస్తుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. టీఎంసీ రెబల్ వర్గం బలం మరింత పెరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తమ పార్టీ ఎన్నికల గుర్తు, పార్టీ పేరును కాపాడుకునే పనిలో నిమగ్నమైనట్టు మీడియాలో వార్తలు వెలువడ్డాయి.


టీఎంసీకి రాష్ట్రంలో 80 ఎమ్మెల్యేలు ఉండగా రుతువ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో తామే అసలైన టీఎంసీ అని రుతువ్రత స్పష్టం చేయడంతో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కింది. పశ్చిమబెంగాల్‌లో ఓటమి తరువాత టీఎంసీలో విభేదాలు పెరిగాయి. రాష్ట్రంలో అవినీతి, ఆర్‌జీ కార్ ఆసుపత్రి హత్యాచారం కేసులో ప్రభుత్వ తీరును సొంత పార్టీ నేతలే విమర్శించారని సమాచారం.


ఈ వార్తలనూ చదవండి:

ఢిల్లీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది..

ట్రెక్కింగ్‌కు వెళ్లి యువతి మిస్సింగ్.. ఇద్దరు స్నేహితుల అరెస్ట్..

Updated Date - Jun 04 , 2026 | 03:47 PM