Share News

రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి: కవిత

ABN , Publish Date - Nov 16 , 2026 | 03:18 PM

తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.

రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి: కవిత
Telangana Drought

నిజామాబాద్, నవంబరు 16: తెలంగాణ రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి కరువు మండలాలుగా ప్రకటించాలని, పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర చరిత్రలో రైతులను పంటలు వేయవద్దని చెప్పిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని కవిత విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కరువు పరిస్థితులను ప్రస్తావించకపోవడం బాధాకరమని అన్నారు.

ఇదిలా ఉండగా.. ఇంటర్ బోర్డు రద్దు అంశంపై త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు కవిత వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మరోవైపు భైరవ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని, యాత్రను విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.


హరీశ్ రావు అవినీతిపై అన్ని ఆధారాలూ సీఎంకు అందజేస్తాం..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై కవిత మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీశ్ రావు అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తామని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా.. ఈ వ్యవహారాన్ని చట్టపరంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఇప్పటికే విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీసీఐడీకి లేఖల ద్వారా సంబంధిత ఆధారాలను అందజేస్తున్నామని వెల్లడించారు. అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలని.. వాస్తవాలు ప్రజల ముందుకు రావాలని అన్నారు. ఒకవైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రైతులకు నష్టపరిహారం, ఇంటర్ బోర్డు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే, మరోవైపు హరీశ్ రావుపై విమర్శలు, చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి...

ఈనెల 17న ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అధికారిక షెడ్యూల్ ఖరారు..

ఉద్యోగం కోసం మలేసియా వెళ్లి జైలుపాలైన కామారెడ్డి యువకుడు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 04:14 PM