Share News

కేంద్రం తక్షణ సాయం అందించాలి: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Oct 17 , 2026 | 06:15 PM

తెలంగాణలో 315 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, రైతులను ఆదుకునేందుకు కేంద్రం తక్షణ ఆర్థిక సాయం అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. పంటల కొనుగోలుకు భరోసా కల్పించాలని, విత్తనాలకు అదనపు బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్రం తక్షణ సాయం అందించాలి: మంత్రి తుమ్మల
Thummala Nageswara Rao

హైదరాబాద్, అక్టోబర్ 17: తెలంగాణలో కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్వహించిన ‘ఖేత్ బచావో అభియాన్’ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న తుమ్మల.. రాష్ట్రంలోని 315 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని వివరించారు.

కరవు ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు అండగా నిలవాలని, సూక్ష్మ సేద్యం, మధ్యంతర పంటల విత్తనాల కోసం అదనపు బడ్జెట్ కేటాయించాలని కోరారు. మొక్కజొన్న, జొన్న సహా ప్రధాన పంటలను కనీస మద్దతు ధర (MSP)తో 100 శాతం కొనుగోలు చేయాలని సూచించారు. ధరల మద్దతు పథకం కింద కొనుగోళ్లకు విధించిన 25 శాతం పరిమితిని తొలగించాలని కేంద్రాన్ని కోరారు. అలాగే ఎరువుల ధరలు, సబ్సిడీలను హేతుబద్ధీకరించి రైతులపై ఆర్థిక భారం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.


రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలి..

కరవు పరిస్థితుల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్థిక భరోసా అందించాలని మంత్రి తుమ్మల సూచించారు. ఫామ్ పాండ్లు, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో కరవు ప్రభావాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. కేవలం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం సరిపోదని, రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించడంతో పాటు పంటల కొనుగోలుపై స్పష్టమైన భరోసా కల్పించాలని కేంద్రాన్ని కోరారు. రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు ‘ఖేత్ బచావో అభియాన్’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలను గుర్తించి, రైతులకు అవసరమైన సహాయం అందించే అంశాలపై దృష్టి సారించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి

ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు

Read Latest AP News And Telangana News

Updated Date - Oct 17 , 2026 | 09:01 PM