Share News

15న ప్రధానితో సీఎం రేవంత్‌ భేటీ

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:45 AM

రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులతో ముడిపడిన సమస్యలను నివేదించడానికి ప్రత్యేకంగా ఈనెల 15న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు.

15న ప్రధానితో సీఎం రేవంత్‌ భేటీ
CM Revanth Reddy

  • నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించడానికే

  • 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీనిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని, ఏఐబీపీ కింద సాయమందించాలని కోరనున్న ముఖ్యమంత్రి

  • భేటీలో సీఎంతో పాటు పాల్గొననున్న మంత్రి ఉత్తమ్‌

  • 15న ప్రధానితో సీఎం రేవంత్‌ భేటీ

  • నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించడానికే..

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులతో ముడిపడిన సమస్యలను నివేదించడానికి ప్రత్యేకంగా ఈనెల 15న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు. ప్రధానికి పలు అంశాలను నివేదించి వినతిపత్రాన్ని అందించనున్నారు. ప్రధానంగా 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత-వార్ధా సంగమంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి సమ్మతి ఇప్పించాలని, అదేవిధంగా ఈ ప్రాజెక్టుకు తగిన అనుమతులు ఇచ్చి.. ప్రధానమంత్రి కృషి సింఛాయ్‌ యోజన /సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద సహాయం అందించాలని కోరనున్నారు. సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టుకు ఛత్తీస్ గఢ్ నుంచి ఎన్‌వోసీ ఇప్పించి.. ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ(కేంద్ర జలవనరుల సంఘం) నుంచి క్లియరెన్స్‌లు ఇప్పించాలని నివేదించనున్నారు. పూర్తి ఆయకట్టు వివరాలు లేవనే కారణాలతో ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ వెనక్కి పంపించిన విషయం విదితమే. ప్రధానంగా ఈ ప్రాజెక్టుకు ఛత్తీ్‌సగఢ్‌ నుంచి ఎన్‌వోసీ పెండింగ్‌లో ఉంది. ఇక గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టును సమ్మక్కసాగర్‌/ఇచ్చంపల్లి నుంచి చేపట్టాలని, ఈ ప్రాజెక్టు ద్వారా తరలించే జలాల్లో 50 శాతం వాటాను తెలంగాణకు ఇవ్వాలని కోరనున్నారు. అలాగే సీతమ్మసాగర్‌ బ్యారేజీకి పర్యావరణ అనుమతులు లభించేలా చొరవ తీసుకోవాలని, సీతారామ ఎత్తిపోతలపథకం/సీతమ్మసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు కేంద్రం సాయం అందించాలని అభ్యర్థించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు సీతారామ, ఇతర పథకాలకు తీసుకున్న రుణాలను పునర్‌వ్యవస్థీకరించాలని ప్రధాని మోదీని కోరనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి..

మూడు టిమ్స్‌కు ఒకే రిక్రూట్‌మెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు

Updated Date - Nov 13 , 2026 | 04:03 AM