కల్వకుంట్ల కిషన్‌రావు!
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:24 AM
మాజీ సీఎం కేసీఆర్‌కు ఇద్దరు పుత్రులు ఉన్నారని, ఒకరు దొంగ పుత్రుడు కేటీఆర్ అని, మరొకరు దత్తపుత్రుడు కిషన్‌రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
కేసీఆర్‌కు దత్తపుత్రుడిగా మారిన కిషన్‌రెడ్డి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు నన్ను రేవంతొద్దీన్ అన్నందుకు నేనేమీ బాధపడటంలేదు. రాష్ట్రంలో బీసీ గణన చేపట్టినప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ నన్ను రేవంత్‌గౌడ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసిన సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క.. రేవంత్‌మాదిగ అన్నారు. వాకిటి శ్రీహరిని మంత్రిని చేసినపుడు రేవంత్ ముదిరాజ్‌గా, అనిల్‌యాదవ్‌ను రాజ్యసభ ఎంపీగా చేసినపుడు రేవంత్‌యాదవ్‌గా, సిక్కులు సర్దార్ రేవంత్‌సింగ్‌గా సంబోధించారు. అన్ని కులాలు, అన్ని వర్గాలవారు నన్ను వారిలో కలుపుకొని ఆదరిస్తున్నప్పుడు నాకు అభ్యంతరం ఎందుకుంటుంది? బీజేపీ నేతలు రేవంతొద్దీన్ అనుకున్నా నాకు అభ్యంతరం లేదు.
- సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును కాపాడుతోంది ఆయనే
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పింది బీజేపీయే
అందుకే సీబీఐకిచ్చాం.. కేసీఆర్, కేటీఆర్‌ల అరెస్ట్ ఎప్పుడు?
మేం వచ్చాక 70 వేల ఉద్యోగాలిచ్చాం.. కావాలంటే తలలు లెక్కపెట్టుకోండి.. ఒక్కటి తక్కువైనా.. తల తీసేసుకుంటా
బీఆర్‌ఎస్, బీజేపీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్లే
మహేశ్‌కుమార్‌గౌడ్‌తో నాది విక్టరీ జోడీ
కాంగ్రె్‌సను రెండోసారీ అధికారంలో తీసుకొస్తాం
నిజామాబాద్ బర్దీపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నిజామాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాజీ సీఎం కేసీఆర్‌కు ఇద్దరు పుత్రులు ఉన్నారని, ఒకరు దొంగ పుత్రుడు కేటీఆర్ అని, మరొకరు దత్తపుత్రుడు కిషన్‌రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. కల్వకుంట్ల కిషన్‌రావుగా మారారని వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు జైలుకు వెళ్లకుండా ఆయనే కాపాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని రాష్ట్ర బీజేపీ నేతలే చెప్పారని, ఆ కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో జైలుకు పంపుతామన్నారని తెలిపారు. కానీ, తాము ఆ కేసును సీబీఐకి అప్పగించి ఆరు నెలలు దాటుతున్నా ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కేసీఆర్, హరీశ్‌రావును జైలుకు పంపాలంటూ ఎంపీ అరవింద్ సవాల్ చేశారని గుర్తు చేశారు బీజేపీ, బీఆర్‌ఎ్‌సల తలలు వేరైనా.. శరీరం ఒక్కటేనని, వారు వీణ-వాణిలాగా ఒకే తల ఉన్న కవల పిల్లలని విమర్శించారు.
శుక్రవారం నిజామాబాద్ జిల్లా బర్దీపూర్ వద్ద నిర్వహించిన ప్రజా పాలన ప్రగతిబాట బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎక్కడ దాక్కున్నారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలుసుకొని ఆయనను జనజీవన స్రవంతిలో కలపాలని అన్నారు. ఫార్ములా ఈ-కారు రేసు కేసు ఫైలును ప్రధాని మోదీ ఆఫీ్‌సలో ఒక మూలన పడేశారని రేవంత్ ఆరోపించారు. ఈ కేసులో కేటీఆర్‌ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలన్నారు. బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చి, అందులో ఇద్దరిని కేంద్ర మంత్రులను చేసిన రాష్ట్రానికి వారివల్ల ఒరిగిందేమీ లేదన్నారు. మూసీ ప్రక్షాళనకు నిధులు ఎందుకు ఇవ్వడంలేదని, హైదరాబాద్‌లో మెట్రో పొడిగింపునకు కేంద్రం నిధులు తెస్తామంటే తాము వద్దన్నామా? అని ప్రశ్నించారు. నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీ చేయడంలో ఎంపీ అరవింద్ విఫలమయ్యారని, మోదీ దగ్గర పరపతి ఉందని చెప్పుకొనే అరవింద్.. ఏడేళ్లలో ఎంపీగా జిల్లాకు చేసిందేమిటో చెప్పాలని అన్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధం..
మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీకి ఓటు వేస్తే.. మూసీనదిలో వేసినట్టేనని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్‌ఎ్‌సకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని, ఆ రెండు పార్టీలది ఫెవికల్ బందమని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని బొందపెట్టాలన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో, 12 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కావాలంటే ఫామ్‌హౌ్‌సలో పడుకున్న కేసీఆర్ తలలు లెక్కపెట్టుకోవాలని, ఒక్క తల తగ్గినా.. తన తల తీసుకుంటానని ప్రకటించారు. గ్రూప్-1 ఉద్యోగాలు 12 ఏళ్ల తర్వాత ఇస్తే కాళ్లలో కట్టె పెట్టేందుకు కోర్టుల్లో కేసులు వేశారని, అయితే హైకోర్టు వారికి చెంప చెళ్లుమనేలా తీర్పు ఇచ్చిందని అన్నారు. రెండేళ్లలో కొత్త రేషన్‌కార్డులు ఇచ్చామని, గత ప్రభుత్వ హయాంలో దొడ్డుబియ్యం బర్రెలకు, బ్లాక్ మార్కెట్‌కు వెళ్లేదని, ఇప్పుడు చిన్నపిల్లలు సహా అందరూ సన్నబియ్యం తింటున్నారని తెలిపారు. మహిళల ఉచిత ప్రయాణానికిగాను ఆర్టీసీకి రూ.9 వేల కోట్లు చెల్లించామన్నారు. స్వయం సహాయక సంఘాలకు వెయ్యి బస్సులను, సోలార్ ప్లాంట్‌లను కేటాయించామని వెల్లడించారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసాతోపాటు బోనస్ కూడా ఇచ్చామన్నారు.
మోదీకి ఓటేస్తే ఒరిగేదేమీ లేదు..
గల్లీలో జరిగే ఎన్నికలకు.. ఢిల్లీలో ఉన్న మోదీకి ఓటు వేయడం ద్వారా ఒరిగేదేమీ లేదని సీఎం రేవంత్ అన్నారు. నిజామాబాద్ జిల్లాతో తనకు అవినాభావ సంబంధం ఉందని, తాను పీసీసీ అధ్యక్షుడిని కాకముందు రైతు దీక్ష ఇక్కడే చేశానని గుర్తు చేశారు. అది విజయవంతం కావడంవల్లే అధిష్ఠానం తనను పీసీసీ అధ్యక్షుడిని చేసిందని తెలిపారు. మునిసిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలు, నిజామాబాద్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. ఫలితాల తర్వాత మళ్లీ జిల్లాకు వస్తానన్నారు. అంతకుముందు జిల్లాకు మంజూరైన మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతోపాటు తెలంగాణ యూనివర్సిటీలో పలు భవనాల నిర్మాణానికి, జిల్లాలో పలు రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇటీవల గంజాయి స్మగ్లర్‌ల దాడిలో గాయపడి మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియాతోపాటు రౌడీ షీటర్ రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి రూ.చెక్కును సీఎం అందజేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, రాష్ట్ర మహిళ కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద తదితరులు పాల్గొన్నారు.
నాది, మహేశ్‌గౌడ్‌ది విక్టరీ జోడీ
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, తాను విక్టరీ జోడీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2023 ఎన్నికల్లో తాను పీసీసీ చీఫ్‌గా, మహేశ్‌గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కాంగ్రె్‌సను అధికారంలోకి తీసుకొచ్చామని తెలిపారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్‌గా డి.శ్రీనివాస్, ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రె్‌సను రెండోసారి అధికారంలోకి తెచ్చినట్లే.. వచ్చే ఎన్నికల్లోనూ తాను, మహేశ్‌గౌడ్ కలిసి తెలంగాణలో రెండోసారి కాంగ్రె్‌సను అధికారంలోకి తీసుకొస్తామని అన్నారు.


నేడు పరిగిలో సీఎం రేవంత్ పర్యటన
సీఎం రేవంత్‌రెడ్డి శనివారంనాడు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పరిగి మండలం నారాయణపూర్‌లో ప్రజాపాలన-ప్రగతి బాట బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను అందజేయనున్నారు.
సీఎం రేవంత్‌తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ
సీఎం రేవంత్‌రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క శుక్రవారంనాడు ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు, బడ్జెట్ సంబంధిత వ్యవహారాలు, గద్దర్ అవార్డులు, ఇతర అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నట్లు చెబుతున్నారు. అలాగే హార్వర్డ్ వర్శిటీ నుంచి సర్టిఫికెట్ అందుకున్న సీఎం రేవంత్‌రెడ్డిని భట్టి అభినందించినట్లు తెలుస్తోంది.