ఫ్యూచర్ సిటీ 8 ఏళ్లలో పూర్తి
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:27 AM
ప్రపంచానికి దిక్సూచిగా.. న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌లతో పోటీ పడేలా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ఎనిమిదేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. ఎవరు అడ్డుపడినా అడ్డంగా తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు....
న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌లతో పోటీ పడేలా నిర్మిస్తాం
ఫ్యూచర్ సిటీకి అడ్డుపడితే అడ్డంగా తొక్కుతాం
హైటెక్‌సిటీ, ఓఆర్‌ఆర్ నిర్మాణాలప్పుడూ కొందరు అడ్డుకున్నారు
నాటి సీఎంలు ముందుకే వెళ్లారు.. నేడు వాటి ఫలాలు చూస్తున్నాం
ఫ్యూచర్‌సిటీ రద్దు చేస్తామనేవాళ్లకు ప్రతిపక్ష హోదా కూడా రాదు
డిసెంబరులో రాష్ట్రంలో మళ్లీ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తాం
బంగారం కంటే విలువైనవి రంగారెడ్డి జిల్లా భూములు
కబ్జాకోరులపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం రేవంత్‌రెడ్డి
‘ఫ్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ’ భవనం ప్రారంభం
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)
ప్రపంచానికి దిక్సూచిగా.. న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌లతో పోటీ పడేలా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ఎనిమిదేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. ఎవరు అడ్డుపడినా అడ్డంగా తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించిన ‘ఫ్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ’ (ఎఫ్‌సీడీఏ) భవనాన్ని రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, రేపటి తరాల కోసం ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టామన్నారు. ప్రపంచానికి దిక్సూచిగా నిలిచే విధంగా ఆధునిక మౌలిక సదుపాయాలు, పర్యావరణహిత ప్రణాళికలు, అత్యాధునిక సాంకేతికతతో తీర్చిదిద్దుతామన్నారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం పేర్కొన్నారు. ఫ్యూచర్‌సిటీలోకి గ్రీన్ ఫార్మా, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు, ఐటీ కంపెనీలతో పాటు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను ఆకర్షించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని కొందరు మాట్లాడుతున్నారని.. అలాంటి వారిని ప్రజలు బండకేసి కొడతారని, వారికి రాజకీయంగా భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. ఆనాడు రామాయణంలో రావణాసురుడు ఉన్నట్లుగా ఈనాడు శుక్రాచార్యుడు ఫామ్‌హౌస్‌లో ఉండి మారీచుడు, సుభాహులను రోడ్డు మీదకు వదిలాడని.. పెద్ద రాక్షసులు, పిల్ల రాక్షసులు కలిసి భారత్ ఫ్యూచర్ సిటీనీ అడ్డుకుంటాం... రద్దు చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. ‘మీరు రద్దయిన రూ.వెయ్యి నోటు లాంటివాళ్లు. మీకు భవిష్యత్తు లేదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. స్మశానానికి పంపారు. భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు’ అని పేర్కొన్నారు.

హైటెక్ సిటీ, ఔటర్ రింగురోడ్డు, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మాకంపెనీలు, జీనోమ్ వ్యాలీ వద్దని అడ్డుకున్న వాళ్లు ఆ రోజుల్లో కూడా ఉన్నారని.. ప్రజలు బాగుపడవద్దని కొందరు కుట్రలు, కుతంత్రాలు చేశారని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆనాటి సీఎంలు వాటికి ఆగిపోయి ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోకపోతే ఈనాడు ఐటీ రంగంలో 10 లక్షల మంది తెలంగాణ పిల్లలు రాణించేవారా? ఒక్కసారి ఆలోచించాలని ప్రజల్ని సీఎం కోరారు. ఏడ్చే వాళ్ల ముందు మనం జారిపడినట్లుగా కాకుండా మనం మరింత అభివృద్ధి సాధించాలన్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబరులో ఫ్యూచర్‌సిటీ పనులు ప్రారంభించి ఇప్పుడు కార్యాలయం ప్రారంభిస్తున్నామని, ఇది ప్రభుత్వ పనితనానికి, అధికారుల ప్రణాళికలకు నిదర్శమన్నారు.
బంగారం కంటే విలువైనవి రంగారెడ్డి భూములు
కులీకుతుబ్‌షాలు, నిజాంలు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి అద్భుతంగా విస్తరించడం వల్ల ప్రపంచ పటంలో నగరానికి గొప్ప గుర్తింపు వచ్చిందని సీఎం గుర్తు చేశారు. సైబరాబాద్.. రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చిందని, తెలంగాణకు వచ్చే ఆదాయంలో 60 శాతం ఇక్కడ నుంచే వస్తుందన్నారు. ఈనాడు సైబరాబాద్ ప్రాంతంలో ఎకరా రూ.200 కోట్లు పలుకుతోందని, బంగారం కంటే రంగారెడ్డి జిల్లా భూములే ఎక్కువ విలువ అని నిరూపించిన చరిత్ర సైబరాబాద్‌దే అన్నారు. ఇటీవల కురిసిన వర్షాల సందర్భంగా ఎదురైన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం చేస్తామన్నారు. డిసెంబరు నెలలో మళ్లీ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోని గ్రామాలను సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగం చేస్తున్నామని, ఈ ప్రాంతాలను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
కబ్జాకోరులపై ఉక్కుపాదం మోపుతాం
నాలాలు, కుంటలు, ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తే సహించేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. గతంలో దుర్మార్గులు చెరువులు, నాలాలు, పబ్లిక్ పార్కులను ఆక్రమించడం వల్లే ఇపుడు హైదరాబాద్‌లో వరద సమస్యలు వస్తున్నాయన్నారు. ఇప్పటికే నగరంలో పలు చెరువులు, కుంటల ఆక్రమణలు తొలగించి వాటిని పునరుద్ధిస్తున్నామన్నారు. బతుకమ్మ కుంట ఏమైనా ఎడ్ల సుధాకర్ తాత ఆస్తా? అని సీఎం ప్రశ్నించారు. కబ్జాకోరులపై ఉక్కుపాదం మోపుతామని.. తోకలు కత్తిరిస్తామన్నారు. కాగా కందుకూరు, మహేశ్వరం మండలాల పరిధిలో మిగిలిన గ్రామాలన్నింటినీ ఫ్యూచర్‌సిటీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు సీఎం అనుమతించారు. సంబంధిత ఫైలుపై సభా వేదికపైనే సంతకం చేశారు. ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన గదిలో పూజలు నిర్వహించారు.
అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు: భట్టి
తెలంగాణ అభివృద్ధి కోసం తాము అహర్నిశలు కృషి చేస్తుంటే బీఆర్‌ఎస్ నేతలు ఓటమితో ఎదురైన నిరాశ, నిస్పృహలతో విషం చిమ్ముతున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఎఫ్‌సీడీఏ, మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులపై కుట్రలు పన్ని అడ్డుకునే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజలు చేయిచేయి కలిపి అభివృద్ధికి సహకరిస్తున్నారని, మరికొన్ని గ్రామాలను ఎఫ్‌సీడీఏ పరిధిలో విలీనం చేయాలని కోరుతున్నారని, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలని కోరారు. ఫ్యూచర్ సిటీతో మరో కొత్త నగరాన్ని నిర్మించేందుకు అడుగులు పడ్డాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ ప్రాంతం ప్రపంచంలోనే ప్రఖ్యాత నగరంగా రూపుదిద్దుకుంటుందన్నారు. భూములు కోల్పోతోన్న రైతులకు ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
